తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 2 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల ఫలితాల్ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పేపర్-1, పేపర్-2 కలిపి మొత్తం 83,711 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 10 రోజుల పాటు జరిగిన పేపర్లకు 2,75,753 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 2,05,278 మంది పరీక్షలు రాశారు. పేపర్-1లో 69,476 మందికి గాను 59.48 శాతంతో 41,327 మంది.. పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ లో 69,390 అభ్యర్థులకు గాను 34.24%తో 23,255 మంది.. సోషల్ లో 66,412 అభ్యర్థులకు గాను 28.05 శాతంతో 18,629 మంది ఉత్తీర్ణులయ్యారు.
జనవరి 24న ప్రాథమిక కీ విడుదల చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కుల్ని పరిగణలోకి తీసుకోనుండగా.. ఏటా ఈ పరీక్షల్ని నిర్వహిస్తామమని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో TS TET సర్టిఫికేషన్ కు ఏడేళ్ల చెల్లుబాటు ఉండగా, దాన్ని సవరించారు. ఇకనుంచి TET స్కోరు జీవితకాలం ఉండనుంది. MLC ఎన్నికల కోడ్ ఉండటంతో రిజల్ట్స్ విడుదల చేస్తారా, లేదా అన్నది సంశయంగా మారింది. కానీ చివరకు ఫలితాలు విడుదలయ్యాయి.