పదం పదం మధ్య పొందిక… ఉచ్ఛారణ దోషాలు లేకుండా వార్తను వార్తలాగే చదవడం.. ప్రతి వాక్యాన్ని వీక్షకుడికి ఎలా విడమరచి చెప్పాలో ఒక పుస్తకం లాగా ముద్రవేసిన వ్యక్తి ఆయన. వార్తలంటే 24 గంటల పాటు గజిబిజిగా చదువుతూ వీక్షకుల్ని గందరగోళానికి గురిచేస్తున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. కానీ వార్తలంటే ఇలాగే ఉండాలి… వార్తలు చదివే వ్యక్తి కూడా ఇలా ఉంటేనే బాగుంటుంది.. అని భావించిన వ్యక్తి ఆయన.
టీవీలు లేని కాలంలో వాడ వాడంతా ఒక్క చోట కూర్చుని వార్తలు వినే కాలంలో ఆహార్యం, భాష ఉచ్ఛారణతో అందరినీ ఆకట్టుకుంటూ సాగిన వ్యక్తి దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్(Shanthi Swaroop). అలా తెలుగు హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్న శాంతిస్వరూప్ కన్నుమూశారు.
గుండెపోటుతో…
తొలి తెలుగు న్యూస్ రీడర్ అయిన శాంతిస్వరూప్ రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురై హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. టెలీప్రాంప్టర్(Tele Promptor) లేకుండా పదేళ్ల పాటు పేపర్ చూసి వార్తలు చదివిన వ్యక్తి ఆయన.
2011లో రిటైర్ అయ్యే వరకు వార్తలు చదివిన శాంతి స్వరూప్.. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. 1983 నవంబరు 14 దూరదర్శన్ లో వార్తలు చదవడం ప్రారంభించారు శాంతి స్వరూప్. 1980-90 దశకంలో తన హావభావాలతో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి ఆయన.