పరీక్ష రాయనున్న గురుకుల విద్యార్థులకు రేపు నిజంగానే కఠిన పరీక్ష ఎదురుకాబోతున్నది. పొద్దున 8:30కు పరీక్ష రాయాల్సి ఉండగా.. ఎనిమిది గంటల దాకా బస్సులు బంద్ చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గాను సర్కారు పంపించిన బిల్లును గవర్నర్ తమిళిసై పెండింగ్ లో పెట్టడంతో… ఆగ్రహంగా ఉన్న కొన్ని కార్మిక సంఘాలు బంద్ కు పిలుపునిస్తూ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయం ఇంకా చాలా మంది గురుకుల పరీక్ష రాసే అభ్యర్థులకు తెలుసో తెలియదో కానీ.. శనివారం పొద్దున మాత్రం ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశముంది. కేవలం 2 గంటలు మాత్రమే బంద్ అని చెప్తున్నా బస్సులు బయటకు వచ్చి అందరూ డ్యూటీల్లో చేరడం అనుమానంగానే ఉంటుంది. అదే జరిగితే రోజులో 3 షిఫ్టుల్లో పరీక్షల ఉండే అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరమే అవుతుంది.
దూర ప్రాంతాల్లో ఉన్న క్యాండిడేట్స్ పొద్దున 8 గంటలకే ఎగ్జామ్ సెంటర్ కే చేరుకోవాల్సి ఉంటుంది. అరగంట ముందే సెంటర్లకు చేరుకోవాలని గురుకుల బోర్డు ముందే స్పష్టం చేసింది. ఈ లెక్కన ఆ టైమ్ కు రీచ్ కావాలంటే తెల్లవారుజాము ఏ నాలుగో లేదా 5 గంటలకు బయల్దేరాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు తప్ప వేరే వాహనాలు ఉండవు. ప్రైవేటు వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకవు. ఇక బైక్ లపై వెళ్దామంటే అంత దూర ప్రయాణం కష్టం. ఇక మహిళా అభ్యర్థుల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం గురుకుల పరీక్ష రాసే అభ్యర్థులు పడే పాట్లు అంతా ఇంతా కావని అర్థమవుతున్నది.