గురుకుల ఉపాధ్యాయ TGT(Trained Graduate Teachers) అభ్యర్థులు… టెట్(TET) స్కోరును అప్ డేట్ చేసుకోవాలని గురుకుల నియామక బోర్డు స్పష్టం చేసింది. ఈ నెల(ఫిబ్రవరి) 21లోపు అభ్యర్థులంతా తమ టెట్ స్కోరును అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. TGT పోస్టులకు టెట్ స్కోరు అప్ డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒక్కరోజే గడువు ఉన్నందున క్యాండిడేట్స్ అంతా టెట్ స్కోరును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్ డేట్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే 4,020 TGT పోస్టుల ఫలితాల విడుదలకు కసరత్తు చేయనున్నట్లు తెలిపింది.
సొసైటీలు, జోన్ల వారీగా ప్రాధాన్యక్రమంలో ఆప్షన్స్ ఇవ్వాలంటూ గురుకుల పరీక్ష రాసిన క్యాండిడేట్స్ కు గతంలోనే గురుకుల బోర్డు స్పష్టం చేసింది. ఆప్షన్స్ ఇస్తేనే మెరిట్ ప్రాతిపదికగా పోస్టులు దక్కించుకునే అవకాశాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు ఆప్షన్స్ ఇస్తేనే అప్లికేషన్ ముందుకు వెళ్తుందని, లేదంటే అక్కడే నిలిచిపోతుందని హెచ్చరించింది. అయినా కొందరు దీనిపై నిర్లక్ష్యం చేయడంతో మిగతా దశకు చేరుకోలేకపోయారు.
గురుకుల నియామక పరీక్షలు గతేడాది ఆగస్టు 1 నుంచి 23 వరకు జరిగాయి. 9,231 ఉద్యోగాల కోసం 2,63,045 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకుల పాఠశాలలు.. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పోస్టులకు ఏప్రిల్ 6న మొత్తం 9 నోటిఫికేషన్లు వచ్చాయి. ఇప్పుడు కూడా అభ్యర్థులు ఎంత తొందరగా టెట్ స్కోరు అప్ డేట్ చేసుకుంటే అంత మేలు జరిగే అవకాశం ఉంది.