ఎలక్ట్రిక్ బస్సుల పేరిట RTC బస్ డిపోలను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న ప్రచారాలపై సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని ప్రైవేటీకరణ అనేది దుష్ప్రచారమని తెలిపింది. ఎలక్ట్రిక్ బస్సుల మెయింటెనెన్స్, ఛార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా TGSRTC ఆధ్వర్యంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ EV పాలసీ ప్రకారం పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో ఈ బస్సుల్ని తేబోతున్నామని సంస్థ ప్రకటించింది.
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సుల్ని తిప్పుతామని, అన్ని రూట్లకు వీటిని పంపించే వీలు లేనందున తిరిగే కిలోమీటర్ల సామర్థ్యాన్ని బట్టి రూట్లను గుర్తిస్తామని చెప్పింది.ఈ తరహా వాహనాలతోపాటు అన్ని రకాల బస్సుల ఆపరేషన్స్ ను TGSRTC నిర్వహిస్తుందని, ప్రైవేటు సంస్థలకు డిపోల్ని అప్పగించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేసింది. ఉద్యోగుల విలీనంపై అప్పటి ప్రభుత్వం వేసిన కమిటీ తన రిపోర్టును ఈ సర్కారుకు అందివ్వాల్సి ఉందన్న సంస్థ… ప్రైవేటీకరణ వదంతుల్ని సిబ్బంది, ప్రజలు నమ్మొద్దని కోరింది.