
కాకతీయ యూనివర్సిటీలో చెలరేగిన వివాదంతో విద్యార్థి JAC(Joint Action Committee) ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు వరంగల్ జిల్లా బంద్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులే కొట్టారంటూ ప్రధాన ఆరోపణలు రావడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. PhD ప్రవేశాల్లో జరిగిన అక్రమాలపై ఘర్షణ మొదలు కాగా.. KU అధికారులతో స్టూడెంట్స్ సాగించిన చర్చలు ఫెయిలయ్యాయి. PhD కేటగిరీ-2 ప్రవేశాల్లో అవకతవకలపై నిరసన తెలుపుతుంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తూ 6 రోజులుగా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. మెరిట్ ప్రకారం సెకండ్(Second) లిస్ట్ ప్రకటించి అడ్మిషన్లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
రిజిస్ట్రార్ ను తొలగించడంతోపాటు తమపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలన్నది KU విద్యార్థుల ప్రధాన డిమాండ్. కేటగిరీ-1 కింద నెట్, సెట్, Mphil ఉన్నవారు నేరుగా PhD సీట్లు పొందుతుండగా.. కేటగిరీ-2 ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారికి రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంది. అయితే ఈ రెండో కేటగిరీలో రోస్టర్ సిస్టమ్ మేరకు కాకుండా పైరవీలతో అడ్మిషన్లు కల్పిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. అయిదేళ్ల తర్వాత గత సంవత్సరం 212 సీట్ల కోసం నోటిఫికేషన్ రిలీజయింది.