
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(Teacher Eligibility Test) పరీక్షలకు అభ్యర్థుల నుంచి పెద్దయెత్తున స్పందన వచ్చింది. ఇప్పటివరకు అప్లికేషన్లు రెండున్నర లక్షలు దాటాయి. నేటితో అప్లికేషన్లకు గడువు ముగియనుండగా ఈ రోజు కూడా పెద్దసంఖ్యలో రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 16 చివరి తేదీ కాగా.. 15 వరకు 2,50,963 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో పేపర్-1కు 74,026 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా, పేపర్-2కు 16,006 అప్లికేషన్లు వచ్చాయి. ఇక రెండు పేపర్లు రాసేందుకు గాను 1,60,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 15న టెట్ పరీక్ష నిర్వహించి, 27న ఫలితాలు(Results) కూడా వెల్లడించనున్నారు. tstet.cgg.gov.in లో టెట్ నోటిఫికేషన్(Notification) పూర్తి వివరాలు ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు పేపర్-1లో లక్షన్నర, పేపర్-2లో రెండున్నర లక్షల మంది అర్హత సాధించారు. ఈ ఎగ్జామ్ మరోసారి నిర్వహించాలన్న కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు నోటిఫికేషన్ ను స్కూల్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబరు 9 నుంచి హాల్ టికెట్లు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు.
సెప్టెంబరు 15న పొద్దున 9:30 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. గత టెట్ తో పోలిస్తే ఎగ్జామ్ ఫీజును రూ.100 అదనంగా పెంచారు. ఒకటి లేదా రెండు రాసినా రూ.400 చెల్లించాల్సిందే. రాష్ట్రంలో చివరగా 2022 జూన్ 12న టెట్ ఎగ్జామ్ జరిగింది. దీని అర్హత కాల పరిమితి జీవిత కాలం కాగా.. పేపర్-1కు బీఈడీ, డీఈడీ.. పేపర్-2కు బీఈడీ అభ్యర్థులు అర్హులు. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 2016 మే, 2017 జులై, 2022 జూన్ లో టెట్ నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 13 వేల పోస్టులు రిక్రూట్ చేయనున్నట్లు గతేడాది ప్రభుత్వం ప్రకటించింది.