రాష్ట్రవ్యాప్తంగా అన్ని RO(Returning Officer) కార్యాలయాల్లో నామినేషన్లు పోటెత్తాయి. ఏకాదశి సందర్భంగా గురువారం నాడు 1,077 దాఖలైతే.. చివరి రోజైన శుక్రవారం నాడు అంతకంటే ఎక్కువగా పెద్ద సంఖ్యలో వచ్చాయి. దీంతో మొత్తం నామినేషన్లు 3,900కు చేరుకుంది. ఇంకా కొన్నింటిని పరిశీలించాల్సి ఉండగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ కోసం చివరి వరకు వేచి చూసిన అభ్యర్థుల్లో కొందరికి ఆయా పార్టీల నుంచి బీఫామ్ దక్కితే మరికొందరు మాత్రం నిరాశలో మునిగిపోయారు. దీంతో నమ్ముకున్న పార్టీ నుంచి టికెట్ రాకున్నా ఇతర పార్టీలు లేదా స్వతంత్రంగా నామినేషన్ దాఖలు చేశారు.
పటాన్ చెరులో కాంగ్రెస్ నుంచి చివరిదాకా పోరాడి టికెట్ రాని నీలం మధు, సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి ఇతర పార్టీల నుంచి నామినేషన్లు వేశారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి సైతం కొందరికి అదే పరిస్థితి ఏర్పడింది. తొలుత ప్రకటించిన అభ్యర్థుల పేర్లను చివరి క్షణంలో మార్చడంతో కాంగ్రెస్, BJPల్లో గందరగోళం కనిపించింది. ఆఖరు రోజు నాడు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగిసిపోయినా అంతకుముందే RO ఆఫీసుల వద్దకు వచ్చిన వారిని లోపలే ఉంచి గేట్లు వేశారు. అలా వారందరికీ నంబరింగ్ కేటాయించి నామినేషన్లు స్వీకరించారు.