
రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా(Final List) విడుదల అయింది. మొత్తంగా 3 కోట్ల 17 లక్షల 17 వేల 389(3,17,17,389) మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు కోటీ 58 లక్షల 71 వేల 493(1,58,71,493) మంది, మహిళలు కోటీ 58 లక్షల 43 వేల 339(1,58,43,339) మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,557 మంది ఉన్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా 6,10,694 ఓట్లు తొలగించినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election Commission) వెల్లడించింది. బోగస్, బదిలీ, మరణించిన కారణాల వల్ల ఓట్లను తొలగించామని తెలిపింది. జాబితాను పరిశీలిస్తే పురుష, మహిళా ఓటర్ల సంఖ్యలో పెద్దగా తేడా కనిపించలేదు.
జనవరితో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెంపు
జనవరితో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. 17,42,470 కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తంగా 5.8 శాతం మేర పెరుగుదల నమోదైంది. లింగ నిష్పత్తి గతంలో 992:1000గా ఉంటే ఇప్పుడది 998:1000గా నమోదైంది. పురుషులు, మహిళల ఓటర్ల సంఖ్యను పోల్చితే కేవలం 28,154 మాత్రమే డిఫరెన్స్ ఉంది. మహిళల కన్నా పురుషులు స్వల్ప సంఖ్యలో ఎక్కువగా ఉన్నట్లు తుది ఓటర్ల లిస్ట్ ద్వారా వెలుగుచూసింది. 5,80,208 ఇంటి నంబర్లలో సవరణలు జరిగాయి.
అక్టోబరు 4 తర్వాత కూడా నమోదు
6 మంది కంటే ఎక్కువగా ఓటర్లు నమోదైన 7.66 లక్షల కుటుంబాల వివరాలను వ్యక్తిగతంగా తనిఖీలు చేశామని, ఓటర్ల నమోదు, సవరణల కోసం అక్టోబరు 4 తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.