ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టే డిపార్ట్ మెంట్లలో ప్రధానమైనది అబ్కారీ(Excise) శాఖ. కానీ లోలోపల చోటుచేసుకుంటున్న ఆధిపత్య ధోరణులు, కొందరు అధికారుల పెత్తనం వల్ల ఎక్సైజ్ విభాగం గాడి తప్పిందన్న భావన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. అందుకే ఈ శాఖపై సీరియస్ గా దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్… పలు కీలక నిర్ణయాలకు ఆదేశాలిచ్చారు. అబ్కారీ శాఖలో అక్రమాలు అరికట్టి పన్నుల వసూళ్లు పెరిగేలా చూడాలని, డిస్టిలరీల వద్ద CC కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్(Command Control) తో అనుసంధానించాలని స్పష్టం చేశారు.
నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్…
లిక్కర్ సరఫరా తీరుపై CM పలు సూచనలు చేశారు. గతంలో తాను పరిశీలించిన అంశాల్ని ప్రస్తావిస్తూనే ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఎక్కడికక్కడే అడ్డుకోవాలని రేవంత్ ఆదేశించారు. మద్యం సరఫరా(Supply), విక్రయాల(Sales) లెక్కల్లో తేడాలు ఉంటున్నాయని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు సూచించారు.
ట్రాకింగ్ సిస్టమ్ ఉండాల్సిందే…
ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని మరోసారి స్పష్టం చేస్తూ.. లిక్కర్ సప్లయ్ చేసే వాహనాల(Vehicles)కు సంబంధించిన వే బిల్లులు కచ్చితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ వాహనాలకు GPS(Global Positioning System) అమర్చి వాటిని ట్రాకింగ్ చేయాలన్న CM… బాటిల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ప్రతీది అబ్జర్వ్ చేయాలన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అక్రమాలపై గతంలో నమోదు చేసిన కేసుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.. అందుకు సంబంధించిన పూర్తిస్థాయి రిపోర్ట్ అందజేయాలని ఆదేశించారు.