
మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 11 Jan 2024
పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారీయెత్తున స్పందన వచ్చింది. అయితే ఇంకా కొంత పెండింగ్ లో ఉన్న దృష్ట్యా మరింత గడువు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గత నెల 26 నుంచి ఈ నెల 10 వరకు కల్పించిన వెసులుబాటుతో సర్కారుకు పెద్దయెత్తున ఆదాయం(Huge Amount) వచ్చి చేరింది. ఈ 15 రోజుల్లో రూ.107 కోట్ల మేర ఆదాయం రాగా.. కోటీ 7 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా(Statewide) మొత్తం పెండింగ్ లో ఉన్నవి 3.9 కోట్ల చలాన్లు కాగా.. అందులో సగం కూడా రాకపోవడంతో మరోసారి దీన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆ స్థాయిలో రావాల్సి ఉన్నా…
ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మాత్రమే భారీగా పెండింగ్ చలాన్లు క్లియర్ అవుతున్నాయి. ఇది జిల్లాల్లో చాలా తక్కువగా ఉండటంతో మరోసారి గడువును పొడిగించడం ద్వారా ఇంకో అవకాశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశం కనపడుతోంది. వాస్తవానికి ఈ సారి ఇచ్చిన 15 రోజుల గడువులో రూ.300 కోట్లకు పైగా రెవెన్యూ వస్తుందని అంచనా వేశారు. కానీ అందులో మూడో వంతు మాత్రమే రావడంతో ఈ నెల 31 వరకు గడువు పొడిగించాలని భావించారు. ప్రధానంగా అన్ని జిల్లాల పరిధిలో దీనిపై అవగాహన(Awareness) కల్పిస్తేనే మారుమూల ప్రాంతాల్లోని వ్యక్తులు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశముంటుంది.
హ్యాంగ్… హ్యాక్ భయాలతో…
గత 15 రోజుల ఛాన్స్ లో భాగంగా పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు భారీగా స్పందన రావడంతో ఓపెన్ చేసిన తెల్లారే సదరు సైట్ హ్యాంగ్ అయింది. దీనివల్ల కొంతమంది విసిగిపోయి క్లియరెన్స్ ను మళ్లీ పెండింగ్ లో పెట్టాల్సి వచ్చింది. మరోవైపు సైబర్ నేరగాళ్ల దాడితో పోలీసుల సైట్ మాదిరిగానే ఫేక్ సైట్ క్రియేట్ చేశారు. ఈ ఫేక్ సైట్ తోనూ వాహనదారులు నష్టపోయారా అన్నది పోలీసులు పరిశీలిస్తున్నారు. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునేవారు అసలు, నకిలీ సైట్లను జాగ్రత్తగా పరిశీలించాలని చెబుతున్నారు. అధికారిక సైట్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఈ ఫేక్ సైట్ లో ఇరుక్కునే ప్రమాదముందంటున్నారు. http://www.echallantspolice.in/ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ అయిందని పోలీసులు చెబుతున్నారు. అధికారిక(అసలు) వెబ్ సైట్… http://echallan.tspolice.gov.in/లో మాత్రమే చలాన్లు క్లియర్ చేసుకోవాలని చెబుతున్నారు.