ప్రజాగాయకుడు గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్థం ఎల్.బి.స్టేడియానికి గద్దర్ భౌతిక కాయాన్ని తరలించగా.. ఆయనకు ప్రజలు పెద్ద సంఖ్యలో నివాళులర్పిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎల్.బి.స్టేడియానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిన్న కేటీఆర్, పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి, మాణిక్ రావ్ ఠాక్రేతోపాటు వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా చైతన్య స్ఫూర్తి ప్రదాత భౌతిక కాయాన్ని సందర్శించారు. ప్రముఖులతోపాటు ఆయన్ను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ఎల్.బి.స్టేడియానికి చేరుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు సమాజానికే కాదు.. యావత్ దేశానికి గద్దర్ రోల్ మోడల్ అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆశయాలు నెరవేరకుండానే గద్దర్ వెళ్లిపోయారని ఆవేదన చెందారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని CM కేసీఆర్ ఆదేశించడంతో అధికార యంత్రాంగం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. అల్వాల్ లో గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు చివరి ఘట్టం నిర్వహించనుండగా.. సికింద్రాబాద్ మీదుగా అంతిమయాత్ర జరుగుతుంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే సమయంలో జన్మించిన గద్దర్.. బడుగు జీవుల హక్కుల స్వాతంత్ర్యం కోసం విశేషంగా కృషి చేశారు.