Published 26 Nov 2023
ఎన్నికల విధుల్లో(Election Duties) పాల్గొనే ఉద్యోగులు తాము వేసే ఓటు విషయంలో పెద్ద గందరగోళానికి(Confusion) గురవుతున్నారు. ఓటు వేసుడా లేదా అన్న సంశయంలో పడిపోయారు. డ్యూటీ ఒకచోట, ఓటు మరోచోట అన్న చందంగా తయారైంది వ్యవహారం. మామూలుగా అయితే ట్రెయినింగ్ నాడు, పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో మాత్రమే సెలవు ఇస్తారు. కానీ ఇప్పుడు ఓటు వేసేందుకు కూడా మరో రోజు సెలవు పెట్టాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో గందరగోళం నెలకొనడం, ఓటు వేసే విషయంలో వెసులుబాటు లేకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి కనిపిస్తున్నది.
పరిస్థితి ఇలా…
గత ఎన్నికల సందర్భాల్లో ఇంటిమేషన్ ఆర్డర్ కాపీ చూపించగానే రిసెప్షన్ కౌంటర్ లో పోస్టల్ బ్యాలెట్ అందించేవారు. ఓటు అప్లై చేసుకోవడానికి ఫాం-12 తీసుకుని వాటిని నింపి, MPDO ఆఫీసుల్లోనే బ్యాలెట్ పేపర్ ఇచ్చేవారు. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఉందంటున్నారు. ట్రెయినింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాల్సి ఉండగా.. డ్యూటీ పడ్డ నియోజకవర్గంలోనే రిటర్నింగ్ అధికారి(RO)కి అందించాల్సి రావడంతో కచ్చితంగా ప్రతి ఉద్యోగి RO ఆఫీసుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉదా: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉండే ఉద్యోగికి నిర్మల్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో డ్యూటీ వేశారు. పోస్టల్ బ్యాలెట్ ను ఆయన నిర్మల్ ROకు అందివ్వాల్సి ఉండగా 67 కిలోమీటర్లు జర్నీ చేయాలి. పురుష ఉద్యోగులు సరే.. మహిళా సిబ్బంది పరిస్థితే కష్టంగా మారింది. ఆ.. ఏం ఓటేస్తాంలే అన్న ఆలోచనే కనపడుతున్నది.
ఆ లోపు వేయకపోతే..
ఓటర్లందరితో ఓటు వేయించిన తర్వాత నిదానంగా పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేవారు. అంటే కౌంటింగ్ రేపు ఉందన్న టైమ్ లోనూ ఓటు వేసేవారు. కానీ ఈసారి అలా కాకుండా పోలింగ్ 30న ఉంటే 28వ తేదీ లోపే పోస్టల్ బ్యాలెట్ అప్పగించాలి. అంటే పోలింగ్ కు రెండ్రోజుల ముందే ఓటేయకపోతే అంతే సంగతులు. 30న విధుల్లో ఉండే ఉద్యోగులు 29 నాడే ఇళ్ల నుంచి బయల్దేరనుండగా.. ఆ రెండ్రోజులు సెలవు ఇచ్చారు. కానీ 28 లోపే ఓటేయాలని చెప్పడంతో ఆ రోజుల్లోనూ ఏదో ఒక టైమ్ లో సెలవు పెట్టక తప్పదు. సెలవు సంగతి అటుంచితే… కొంతమందికి 50 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తున్నది. భార్యభర్తలిద్దరికీ డ్యూటీ ఉంటే సతీమణి ఓటు కోసం ఒక RO ఆఫీసుకు, తాను మరో సెగ్మెంట్లోని ఇంకో RO కార్యాలయానికి పోవాల్సిందే. ఇలా ఓటు కోసం తిరగాల్సి రావడంతో ఎన్నికల సిబ్బందిలో అయోమయం ఏర్పడింది. ఇప్పటికైనా తమకు వెసులుబాటు కల్పించాలని ECని అభ్యర్థిస్తున్నారు.