నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గత మూణ్నెల్ల కాలంలో ఎంతగానో అభాసుపాలైన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్లు ప్రకటించినా పరీక్షలు నిర్వహించలేని దుస్థితికి చేరుకున్న కమిషన్ చివరకు నవ్వుల పాలైంది. అలాంటి కమిషన్ కు ఛైర్మన్ గా ఉన్న జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కొద్దిసేపటికే రాజీనామా చేస్తున్నట్లు జనార్దన్ రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి రాగానే TSPSCని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పేపర్ లీకేజీలు, పరీక్షల వాయిదాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఆందోళనలో పడిపోయారు. 2021 మేలో ఆయన కమిషన్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టగా, మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలం ఉంది. ఈలోపు ప్రభుత్వం మారడంతో ఆయన రాజీనామా అనివార్యమైంది.
ఈ జనవరి నుంచి పెద్దయెత్తున నోటిఫికేషన్లు ప్రకటించినా పరీక్షలు నిర్వహించడంలో దారుణాతి దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండు సార్లు రద్దు కాగా.. గ్రూప్-2తోపాటు ఇతర ఎగ్జామ్స్ సైతం సకాలంలో నిర్వహించలేని వాతావరణం ఏర్పడింది. ఈ నెల 6న పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కారు.. TSPSCపై దృష్టిసారించాలని నిర్ణయించింది. ఒక్కొక్క విభాగంపై స్వయంగా సమీక్ష(Review) నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి.. కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డితో మాట్లాడారు. CMను కలిసిన కొద్దిసేపటికే తన పదవికి రాజీనామా చేయాలని జనార్దన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాను గవర్నర్ తమిళిసైకి అందజేయగా… పుదుచ్చేరిలో ఉన్న ఆమె దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.