ఎన్నికల సంఘం ఆదేశాల(Directions) మేరకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్ని ఆదుకోవాలని ఉద్యోగ సంఘమైన TSUTF కోరుతున్నది. వడదెబ్బ, రోడ్డు ప్రమాదాలు, గుండెపోట్లతో పలువురు సిబ్బంది మృత్యువాత పడ్డారు. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచకుండా మారిన బాధిత కుటుంబాలను EC ఆదుకోవాలని సంఘం నేతలు అంటున్నారు.
బాధితులు వీరే…
మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్ నరసింహ హైదరాబాద్ లో.. సిద్దిపేట జిల్లాలో లకావత్ రామన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ సీనియర్ అసిస్టెంట్ శ్రీకృష్ణ, మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ZP హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ గడిగొప్పుల సందానందం విధుల్లో(Duties) ఉండగానే మృతిచెందారు. ఇక ములుగు జిల్లా బూరుగుపేట ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు పోరిక మధుకర్ బ్రెయిన్ స్ట్రోక్ తో తీవ్ర అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
రూల్స్ ప్రకారం…
ఎన్నికల విధుల్లో ఉండగా మరణించిన సిబ్బందికి రూల్స్ ప్రకారం రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని TSUTF అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఎలక్షన్ కమిషన్ ను కోరారు. ఈ మొత్తాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి జిల్లా అధికారులు చెల్లించి, ఆ తర్వాత కేంద్రం నుంచి రీయింబర్స్ చేసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. మధుకర్ ఆరోగ్య పరిస్థితి(Medical Condition) విషమంగా ఉన్నందున EC ఖర్చుతోనే ఆయనకు మెరుగైన చికిత్స అందించాలంటున్నారు.