కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ తీరు ఉందని TSUTF విమర్శించింది. దంపతులు, ప్రాధాన్యత కేటగిరీలు, పరస్పర బదిలీలే చేయాలంటూ రిలీజైన జీవోల పట్ల అసంతృప్తి తెలిపింది. 317 జీవోలోని అసంబద్ధ నిబంధనల వల్ల ఎంతోమందికి నష్టం జరిగిందని, వాటిని సవరించి న్యాయం చేయాలంటూ మూడేళ్లుగా పోరాడితే.. సబ్ కమిటీ ఆర్నెల్లు శోధించి సాధించేందంటంటే గత ప్రభుత్వం చేసిన పనిని ఆమోదించడం మాత్రమేనని స్పష్టం చేసింది. BRS పాలనలో 19 జిల్లాల్లో పూర్తిగా, 13 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ స్థాయి వరకు బదిలీలు చేశారని గుర్తు చేశారు. మిగిలినవారిని అవకాశమున్నంత వరకే చేయాలని, ఫోకల్ కే చేయాల్సిన అవసరం లేదని చెప్పారని, అంటే రివర్స్ స్పౌజ్ చేయమని సూచించారు గానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్పౌజ్ గురించి మాట్లాడలేదని TSUTF అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి విమర్శించారు.
కారుణ్య నియామకాల ద్వారా రిక్రూటైన వితంతువుల్ని మాత్రమే ప్రాధాన్యత కేటగిరీలో పరిగణలోకి తీసుకోవాలంటూ జీవోలో ఉన్న అంశాన్నే తెలియజేశారని, హైకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోలేదని గుర్తు చేశారు. స్థానికత కోల్పోయిన వారి గురించి ప్రస్తావనే లేదని, అలాంటి వారికి న్యాయం చేయడానికి ఏం చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని నాయకులు అన్నారు.