రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తితోపాటు మరో జడ్జి రాబోతున్నారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ అలోక్ అరాధే.. తెలంగాణ CJగా నియమితులయ్యారు. ఛత్తీస్ గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కొశాయ్ ని తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేశారు. పలువురు జడ్జిల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 5న సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి ట్రాన్స్ ఫర్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు CJతో సంప్రదింపుల తర్వాత ఈ బదిలీలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
1964 ఏప్రిల్ 13న జన్మించిన జస్టిస్ అలోక్ అరాధే.. 1988 జులై 12న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 సెప్టెంబరు 16న జమ్మూకశ్మీర్ న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్ అలోక్.. 2018లో మూడు నెలల పాటు ఆ రాష్ట్ర హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. 2018 నవంబరు 17 నుంచి కర్ణాటక హైకోర్టు జడ్జిగా కొనసాగుతున్న ఆయన.. అక్కడా కొంతకాలం CJగా పనిచేశారు. అక్కణ్నుంచి ప్రస్తుతం తెలంగాణకు రానున్నారు.