కేంద్రంలో BJP ప్రభుత్వం, రాష్ట్రంలో KCR సర్కారు టీచర్ల పట్ల వివక్ష చూపుతున్నాయని.. ఇప్పటికైనా CPS రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ USPC డిమాండ్ చేసింది. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ అని చెబుతున్నా గత రెండేళ్లుగా ఏ నెలలోనూ ఫస్ట్ డేట్ నాడు జీతాలు పొందే పరిస్థితి లేదని విమర్శించారు. సెప్టెంబరు 1ని పెన్షన్ విద్రోహ దినంగా పేర్కొంటూ USPC.. హైదరాబాద్ ధర్నా చౌక్ లో భారీ ధర్నా నిర్వహించింది. CPS రద్దుతోపాటు, పెండింగ్ బిల్లుల్ని వెంటనే మంజూరు చేయాలని, మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు. 2004 సెప్టెంబరు 1 కన్నా ముందే ప్రక్రియ పూర్తయి నియామకమైన వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని, స్కూళ్లలో అన్ని ఖాళీల్ని వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యా విధానం-2020 కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ తీరుగా మారిపోయిందని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై MLC జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రెండో PRCని వెంటనే వేయాలని, IRను తక్షణమే ప్రకటించాలని ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో టీచర్లు ఈ ధర్నాకు తరలివచ్చారు. ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరామ్ ధర్నాకు హాజరై మద్దతు ప్రకటించారు. USPC స్టీరింగ్ కమిటీ సభ్యులు కె.జంగయ్య, చావ రవి, వై.అశోక్ కుమార్, ఎం.సోమయ్య, యు.పోచయ్య, సయ్యద్ షౌకత్ అలీ, కొమ్ము రమేశ్, జాదవ్ వెంకట్రావ్, ఎస్.హరికిషన్, జాడి రాజన్న, బి.కొండయ్య, POW సంధ్య, సజయ, పి.కృష్ణమూర్తి, దామోదర్ రెడ్డి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.