
Published 06 Jan 2024
రాష్ట్రంలో విద్యా వలంటీర్ల(Volunteers) వ్యవస్థ లేక నాలుగేళ్లు గడుస్తోంది. 2020 విద్యా సంవత్సరం(Academic Year) గడువు ముగిసిన విద్యా వలంటీర్లను ఇప్పటిదాకా మళ్లీ విధుల్లోకి తీసుకోకపోవడంతో నాలుగేళ్లుగా ఈ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది. కానీ ఇప్పటికప్పుడు టీచర్ల రిక్రూట్ మెంట్ జరిగే అవకాశం లేకపోవడంతో తిరిగి విద్యావలంటీర్లను బాధ్యతల్లోకి తీసుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరాలకు భిన్నంగా ఈసారి బడులు తెరిచే జూన్ 11 నాటికే వీరిని విధుల్లోకి తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బడులు స్టార్టయ్యే తొలిరోజునే వీరంతా డ్యూటీల్లో ఉండాలన్న లక్ష్యంతో సెలక్షన్స్ కొనసాగించనున్నారు. మొత్తంగా విద్యావలంటీర్ల రాకతో ప్రభుత్వ ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గే అవకాశముంది.
కరోనాకు ముందు రాష్ట్రంలో 12,600 మంది విద్యావలంటీర్లు పాఠశాలల్లో ఉండేవారు. 2020 మార్చి తర్వాత అటు విద్యావలంటీర్లను తీసుకోక, ఇటు ఉపాధ్యాయులను రిక్రూట్ చేయలేకపోవడంతో.. బడుల్లో కొరత ఏర్పడింది. వివిధ సబ్జెక్టులకు నిపుణులైన మాస్టార్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో బడి లేని పల్లె ఉండకూడదని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన దృష్ట్యా.. సర్కారీ విద్యాలయాల్లో అటెండెన్స్ పెరగాలంటే సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ ఉండాల్సిందేనన్న నిర్ణయానికి విద్యాశాఖ వచ్చేసింది.
నాలుగేళ్ల కిందటి దాకా వీరికి రూ.12.000 జీతం ఇవ్వగా, ఇప్పుడు ఆ వేతనాన్ని పెంచుతారా, లేదా అన్నది తెలియాల్సి ఉంది. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ ఉపాధ్యాయుల డిప్యుటేషన్ కొనసాగుతూనే ఉంది. రిటైరైన వారి స్థానంలో కొత్త నియామకాలు లేకపోవడంతో… ఒక్కో సబ్జెక్టును చెప్పేందుకు ఇద్దరు అవసరమైన చోట ఒక్కరితోనే కాలం వెళ్లదీయాల్సి వస్తున్న పరిస్థితుల్లో ఈ డిప్యుటేషన్లను నడపాల్సి వస్తోంది. కాబట్టి విద్యావలంటీర్ల రాకతో ఈ సమస్యకు కొద్దిగానైనా పరిష్కారం లభించే అవకాశమైతే ఉంది.