మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 09 Jan 2024
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో ప్రకటన చేయడం, వారం రోజుల్లోపే ‘జ్యుడిషీయల్ ఎంక్వయిరీ’ మొదలవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో ఇక ఎప్పుడెప్పుడా అనే సందిగ్ధం మొదలైంది. మంత్రి ఇచ్చిన క్లారిటీ మేరకు ఇక ఆ సందేహాలకు తెరపడినట్లేనని తాజా చర్యల్ని బట్టి అర్థమవుతున్నది. ఈ నెల 2 నాడు ఉత్తమ్ దీనిపై స్పష్టతనివ్వగా.. చెప్పిన వారం రోజులకే విజిలెన్స్ విచారణ(Vigilance Enquiry) ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా గల కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ కార్యాలయాలపై మూకుమ్మడిగా ఈరోజు సోదాలు జరుగుతున్నాయి. ఇంజినీర్-ఇన్-చీఫ్(ENC) మురళీధర్ తోపాటు రామగుండం ENC ఆఫీసుల్లోనూ పొద్దున 9 గంటల నుంచి తనిఖీలు సాగుతున్నాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే నిధులు సేకరించారు కాబట్టి.. అక్కడి ఆఫీసులోని రికార్డులను విజిలెన్స్ స్వాధీనం చేసుకుంది.
ఏకకాలంలో అన్నిచోట్లా…
కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డుల్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగం సునిశితం(Clear)గా పరిశీలన చేస్తున్నది. హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలోని కాళేశ్వరం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన రికార్డులన్నింటినీ విజిలెన్స్ బృందం స్వాధీనం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో దాడులకు దిగిన విజిలెన్స్ డిపార్ట్ మెంట్… 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్ లను పరిశీలించిన అధికారులు… రికార్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. విజిలెన్స్ SP రమణారెడ్డి నేతృత్వంలో మొత్తం 10 టీమ్ లు, ఇంజినీరింగ్ బృందాలు ఈ దాడులు కొనసాగిస్తున్నాయి.
జరిగిన వ్యవహారమిది…
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సర్కారు మూడేళ్లలో పూర్తి చేసింది. తెలంగాణ-మహారాష్ట్రను కలిపే ఈ బ్యారేజ్ వంతెన ఉన్నట్టుండి కుంగిపోయింది. అక్టోబరు 22న పెద్ద సౌండ్ తో పిల్లర్ దెబ్బతినడంతో 7వ బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో ఇంజినీర్లు బ్యారేజీలోని 10 TMCల నీటిని విడుదల చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ పెద్దయెత్తున ఆరోపణలు చేసింది. లక్ష కోట్లకు పైగా వెచ్చించిన ప్రాజెక్టు కొద్దికాలంలోనే ప్రమాదానికి గురవడంతో న్యాయ విచారణకు కొత్త ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.