
గణేశ్ నిమజ్జనోత్సవాలు హైదరాబాద్ జంట నగరాల్లో శోభాయమానంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. వేలాదిగా తరలివస్తున్న విగ్రహాలతో ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం నిమజ్జనం అయిన ఖైరతాబాద్ గణేశున్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. నిన్న అర్థరాత్రి మొదలైన ఖైరతాబాద్ వినాయకుడు ఈ రోజు మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ చేరుకున్నాడు. ప్రత్యేక భద్రత నడుమ శోభాయాత్ర వైభవంగా సాగింది. డీజే, మేళతాళాలు, డ్రమ్స్ సౌండ్ల నడుమ భాగ్యనగర వీధులు సందడిగా మారాయి. నాలుగో నంబరు క్రేన్ వద్ద ఖైరతాబాద్ వినాయకుడు.. 13వ నంబరు క్రేన్ వద్ద బాలాపూర్ గణేశుణ్ని నిమజ్జనం చేశారు.
పలు ప్రాంతాల్లో వర్షం
ఒకవైపు నిమజ్జనాలు, మరోవైపు వివిధ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదీ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో కనిపించిన వాతావరణం. అయినా వర్షంలోనూ ఎక్కడా శోభాయాత్ర ఆగలేదు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని అనంతరం జరిగిన శోభాయాత్రకు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
లడ్డూ ధర రూ.1.26 కోట్లు
హైదరాబాద్ బాలాపూర్ గణేశుడి వేలం పాట చూసేందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఈసారి బండ్లగూడలో కోటీ 26 లక్షల రూపాయలు పలికిన లడ్డూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కీర్తి రిచ్మండ్ విల్లాలో రికార్డు స్థాయిలో ధర పలికింది. బాలాపూర్ లడ్డూ ఈసారి రూ.27 లక్షలు పలికింది. రూ.1,116 మొదలైన వేలంపాట రూ.27 లక్షలకు చేరుకోగా.. దాసరి దయానందర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను అందుకున్నారు.