విశ్వబ్రాహ్మణుల ఐక్యత నిరూపించేలా భవిష్యత్తులో పంచ కులాలకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా బహిరంగ సభ నిర్వహించాలని విశ్వబ్రాహ్మణ(Vishwa Braahmana) ఐక్య వేదిక నిర్ణయించింది. అక్టోబరు 1న లక్షలాది మందితో ఈ సభ నిర్వహించాలని తీర్మానించింది. ఈ మహాగర్జన సభ చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక(Action Plan) తయారు చేస్తున్నారు. ఐదు వేళ్లు కలిస్తే పిడికిలి బిగించినట్లు ఐదు కులాలు కలిస్తే తమ ఐకమత్యం ఎలా ఉంటుందో గట్టిగా నిరూపిస్తామని విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు స్పష్టం చేశారు. ఇందుకోసం ఆ సంఘం లీడర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పంచకులాలకు చెందిన అన్ని జిల్లాల ప్రెసిడెంట్లు ఈ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. లక్షలాదిగా ఓటర్లున్నా ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని.. కార్పొరేట్ తరహా బిజినెస్ లతో కుల వృత్తులు దెబ్బతిని పూట గడవని స్థితిలో కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయని, వారిని ఆదుకోవడంతోపాటు రాజకీయంగా తమకు సీట్లు కేటాయించాలన్న డిమాండ్లతో ఈ సభ జరగనుంది.
ఈ విశ్వబ్రాహ్మణ సభ హైదరాబాద్ లో ఎక్కడ నిర్వహించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో జనం హాజరయ్యేలా సభ ఉండాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ వేశారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, క్యాషియర్ల నియామకం చేపడుతున్నారు. మరో రెండు నెలలు సమయం ఉన్నందున ఆ లోపు అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్వబ్రాహ్మణ రాష్ట్ర సంఘం నిర్ణయించింది.