
ఎన్నికలను మరింత సరళీకృతం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కొత్త మార్గాలు అన్వేషిస్తున్నది. ఇందులో భాగంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, గంటలకు గంటలు నిలబడి ఓటు కోసం నిరీక్షించే తిప్పలు ఇక నుంచి వృద్ధులకు తప్పనున్నాయి. 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఇక ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు తొలిసారి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
ఓటింగ్ శాతం మరింత పెరగాలి
తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు సమానంగా ఉన్నారని, నిన్న ఓటర్ల లిస్ట్ ను కూడా వెల్లడించామన్నారు. సమాజంలో అన్ని వర్గాల ఓటర్లలో చైతన్యం తీసుకువస్తున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. రెండేళ్లలో 22 లక్షల ఓట్లను తొలగించామని, 66 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారన్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 897 మంది ఓటర్లు ఉంటారని, రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ స్టేషన్లు అందుబాటులో ఉంటాయన్నారు.