Published 20 Jan 2024
రాష్ట్రంలో ఓటు నమోదు(Vote Registration) చేసుకునేందుకు ఎన్నికల సంఘం(Election Commission) మరో అవకాశాన్ని కల్పించింది. రెండ్రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. శని, ఆదివారాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న అధికారులు.. ఓటర్ల నమోదు, జాబితాలో సవరణలతోపాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నారు. ఓట్ల తొలగింపు ప్రక్రియను సైతం ఈ స్పెషల్ డ్రైవ్(Special Drive)లో చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఓటరు నమోదు, సవరణకు అవసరమైన 6, 7, 8 ఫామ్స్.. బూత్ స్థాయి అధికారుల వద్ద తీసుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు సైతం పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే నమోదు కోసం దరఖాస్తులు ఇచ్చినా కొన్నిచోట్ల లిస్టుల్లో పేర్లు లేవనే విమర్శలు వచ్చాయి.
Also Read: చదువుకున్నోడికంటే సామాన్యుడే బెటర్…
త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు…
లోక్ సభ ఎన్నికలు త్వరలోనే జరగనున్న వేళ.. మరోసారి ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. గత నవంబరు 30న జరిగిన పోలింగ్ కోసం సెప్టెంబరు 2, 3 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆన్ లైన్లో https://voters.eci.gov.in లేదా voter helpline మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఫారం-6 నింపి నూతన ఓటరు నమోదు, సవరణలు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్(EC) అప్పుడు అవకాశం కల్పించింది. బూత్ స్థాయి అధికారి అందుబాటులో లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలంటూ EROలను ఆదేశించింది. పూర్తి వివరాలకు ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబరు 1950ని సంప్రదించాలని CEO క్లారిటీ ఇచ్చారు.
Also Read: శాంసంగ్ ఫోన్ల మజాకా… భలే ఉన్నాయిగా ఫీచర్లు…
జాడకు లేని బూత్ స్థాయి అధికారులు…
ఉన్నతాధికారులు ఎన్ని మాటలు చెప్పినా బూత్ స్థాయి అధికారుల(BLO) నిర్లక్ష్యం మామూలుగా లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు బూత్ ల వద్ద ఉండాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినా పట్టించుకుంటేగా మరి. పొద్దున 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండి ఆ తర్వాత లంచ్ అంటూ కనిపించకుండా పోయిన సందర్భాలున్నాయి. ఓటరు నమోదును కచ్చితత్వం(Perfect)తో చేపట్టాలంటే బూత్ లెవెల్ అధికారులు నిర్లక్ష్యం వీడాల్సిన అవసరముంది. ఇప్పటికీ చాలామందికి ఆన్ లైన్ పద్ధతి తెలియకపోవడం, ఆఫ్ లైన్ లో బీఎల్వోలు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇక ఏం రిజిస్ట్రేషన్ చేసుకుంటాంలే అన్న ధోరణి ప్రజల్లో కనపడుతోంది. అందుకే ఎన్నికల సంఘం ఈసారైనా సీరియస్ గా దృష్టిసారిస్తే తప్ప పెద్దగా ప్రయోజనం కనపడదేమోనన్న మాటలు వినపడుతున్నాయి.