కరెంటు బిల్లు మాఫీ కావాలన్నా.. రూ.500కే సబ్సిడీ సిలిండర్ అందాలన్నా.. ఆరోగ్యశ్రీ ఆదుకోవాలన్నా రేషన్ కార్డే ప్రామాణికం.. సర్కారీ పథకం(Scheme) ఏదైనా సరే.. ఏకైక ఆధారం రేషన్ కార్డు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తుండగా.. అందులో రెణ్నెల్లకు పైగా సమయం ఎన్నికల కోడ్ తో ముగిసింది. మొదట సబ్సిడీ సిలిండర్ అందజేసి, తర్వాత గృహజ్యోతి కింద కరెంటు బిల్లులు మాఫీ అవుతున్నా అవి అందని లబ్ధిదారులు భారీగా ఉన్నారు.
మంత్రుల మాట…
కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రితోపాటు మంత్రులు(Ministers) సైతం పలు సందర్భాల్లో భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాం(Term)లో రేపు, మాపు అంటూ తాత్సారం(Delay) చేసి చివరకు కొత్తవి ఇవ్వకుండానే ముగించేశారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఈ మార్చి 12న కేబినెట్ భేటీలోనూ కొత్త కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అయితే దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో అంటూ చాలా మంది ఎదురుచూపులకే పరిమితమయ్యారు.
లెక్కలు ఇలా…
రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలు. కొత్త కార్డుల కోసం 11 లక్షల అప్లికేషన్లు వస్తే.. ఇపుడున్న కార్డుల్లో రేషన్ తీసుకోనివారు 11 శాతం మంది ఉన్నారు. మహాలక్ష్మీ, ఉచిత కరెంటు(గృహజ్యోతి), రైతుబంధు, రైతు భరోసా(Rythu Bharosa), రూ.500కే సిలిండర్ వంటివన్నీ ప్రకటిస్తున్నా… ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులపై స్పష్టత రాకపోవడంతో సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తున్నది.