
Published 20 Dec 2023
అత్యుత్సాహంతో ఎలక్షన్ కమిషన్ నిబంధనల్ని(Model Code Of Conduct) ఉల్లంఘించి చిక్కుల్లో పడిన మాజీ DGP అంజనీకుమార్ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. భవిష్యత్తులో ఆయన ఉద్యోగానికే ఎసరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆయన DGP పదవికి ఎసరు రాగా ECని బతిమిలాడటంతో సస్పెన్షన్ ఎత్తివేశారు. కానీ రాష్ట్రంలో ఆయనపై నిఘా కొనసాగుతుందంటూ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇస్తూ CS శాంతికుమారి పేరిట ఆర్డర్స్ రిలీజ్ అయ్యాయి. ‘మిస్టర్ అంజనీకుమార్.. మీరు చేసిన తప్పుపై క్షమాపణలు చెప్పడంతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మీపై చర్యలు ఎత్తివేశాం.. కానీ ఇలాంటి తప్పు భవిష్యత్తులో చేస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.. మరోసారి ఇలా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలితే ఆలిండియా సర్వీస్(AIS) రూల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అన్నది చీఫ్ సెక్రటరీ శాంతికుమారి విడుదల చేసిన లెటర్ లోని సారాంశం.
ఇప్పటికే లూప్ లైన్ లోకి…
రాష్ట్ర పోలీస్ బాస్ స్థాయి నుంచి లూప్ లైన్ లోకి వెళ్లేదాకా అంజనీకుమార్ ప్రస్థానం ఆశ్చర్యాన్ని తలపించింది. DGPగా ఇంఛార్జి బాధ్యతలతోనే కొనసాగుతున్న ఆయన్ను పూర్తి DGPగా మారుస్తూ కేసీఆర్ సర్కారు ఆదేశాలిచ్చింది. డిసెంబరు 3న ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే కాంగ్రెస్ మెజార్టీని చూసి DGPతోపాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లు మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ జైన్.. రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ ఇంటికి వెళ్లి మరీ పుష్పగుచ్ఛంతో అభినందించడంతో CEC సీరియస్ అయింది. DGPని సస్పెండ్ చేస్తూ మిగతా ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎలాగోలా ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేసినా మొన్నటి బదిలీల్లో ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ గా లూప్ లైన్ కు నెట్టింది. ఇలాంటి ఇబ్బందికర పరిణామాన్ని ఎదుర్కొంటున్న ఈ మాజీ పోలీస్ బాస్.. ఇప్పుడు రాష్ట్ర సర్కారు వార్నింగ్ ను సైతం మోయాల్సి వచ్చింది. అత్యుత్సాహం ప్రదర్శించి ఎన్నికల సంఘం కంట్లో పడితే ఎలా ఉంటుందన్నది అంజనీకుమార్ ను చూస్తేనే అర్థమవుతుంది.