గ్రూప్-1 రెండు సార్లు రద్దు.. గ్రూప్-2 రెండు సార్లు వాయిదా.. DAO పరీక్ష రద్దు.. ఇలా ఇవన్నీ చూస్తుంటే అసలు పరీక్షలు జరుగుతాయా అన్న సందేహం అభ్యర్థులను వెంటాడుతున్నది. రాష్ట్రంలో కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులను చూసి నిరుద్యోగులు ఆవేదనలో పడిపోయారు. పెద్దయెత్తున నోటిఫికేషన్లు వచ్చినా లీకేజీలు, కోర్టు కేసుల వల్ల రిక్రూట్ చేయలేని వాతావరణం ఏర్పడింది. ఏడాది కాలంగా వెలువడుతున్న నోటిఫికేషన్లతో నిరుద్యోగులంతా ప్రిపరేషన్స్ లో పడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడెనిమిది లక్షల మంది ఉద్యోగాల వేటలో పడ్డారు. గ్రూప్స్, గురుకులాలు, పోలీసు, హాస్టల్స్, అకౌంట్స్ ఆఫీసర్స్ ఇలా ప్రతి ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి చదువుతున్నారు. ఇందులో సీరియస్ గా చదివేవాళ్లు 2-3 లక్షల మంది దాకా ఉంటారు. కానీ లీకేజీల వల్ల అందరిలోనూ నిర్వేదం అలుముకోగా.. అసలు ఈ పరీక్షలు జరుగుతాయా అన్న సందేహంలో పడిపోయారు.
జీవితానికి ఇదే ఫైనల్ అనుకుంటూ..
కొన్నేళ్లుగా ఆశించిన రీతిలో నోటిఫికేషన్లు లేక చాలా మంది వయసు దాటిపోతున్నది. ఇపుడు వచ్చిన నోటిఫికేషన్ల మాదిరిగా ఇంకెప్పుడూ వచ్చే అవకాశం లేదన్న ఉద్దేశంతో 40 ఏళ్లు దాటిన అభ్యర్థులు సైతం చావోరేవో అన్నట్లుగా చదవడం మొదలుపెట్టారు. చేతిలో డబ్బులు లేకున్నా అప్పు చేసి మరీ కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఇక పరీక్ష రాయడమే తరువాయి అనుకునే సమయంలోనే గ్రూప్-1 రెండు సార్లు రద్దు, గ్రూప్-2 వాయిదా వల్ల తీవ్ర నిరాశలో మునిగిపోయి జీవితమే కోల్పోయినట్లుగా మనస్తాపం చెందుతున్నారు. గ్రూప్-3కి ఇంకా ఎగ్జామ్ డేట్ ఇవ్వకపోగా.. గ్రూప్-4, గురుకులాల పరీక్షలు జరిగినా రిజల్ట్స్ రాలేదు. రానున్న రోజుల్లో DAO, TRT, HWO(Hostel Welfare Officers)తోపాటు భారీ స్థాయిలో పరీక్షలు జరగాల్సి ఉంది.
అశోక్ నగర్ ఖాళీ
ఎప్పుడు నోటిఫికేషన్లు వచ్చినా హైదరాబాద్ లోని అశోక్ నగర్.. పరీక్షార్థులతో కిటకిటలాడుతుంది. గత ఏడాది కాలం నుంచి అభ్యర్థుల రాకతో అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు కిటకిటలాడాయి. వాస్తవానికి ఎలక్షన్లలో నిరుద్యోగుల పాత్ర కీలకం. వీరి ప్రచారం వల్లే పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కానీ ఈసారి అందరూ కోచింగ్ లకు వెళ్లిపోవడంతో ఎన్నికల హడావుడి మొదలైనా, నోటిఫికేషన్ వచ్చినా నిరుద్యోగులు ఏ మాత్రం పట్టించుకోలేదు. చదువొక్కటే తమ ‘టార్గెట్’ అన్న రీతిలో ఒకరకంగా అజ్ఞాతవాసం గడిపారు. ఇంత సీరియస్ గా సాగుతున్న టైమ్ లో ఎగ్జామ్స్ కు ఎదురవుతున్న ఆటంకాలు చూసి ఆందోళనతో ఉన్నారు. ఎహే.. ఇవేం చదువులు.. అనుకుంటూ నిర్వేదంలో మునిగిపోయారు. పరీక్షలు లేవ్.. ఏం లేవ్.. అంటూ ఇళ్లకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం అశోక్ నగర్ ప్రాంతమంతా ఖాళీగా మారిపోయింది.
ప్రభుత్వం ఏర్పడ్డా పరీక్షలు జరిగేనా…?
డిసెంబరు 3న ఎలక్షన్ రిజల్ట్స్ వెలువడి సర్కారు కొలువుదీరినా ఆ వెంటనే పరీక్షలు జరగడం అనుమానమేనని అభ్యర్థులు అంటున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే TSPSCని ప్రక్షాళన చేస్తామని KTR చెప్పడంతో.. పరీక్షల నిర్వహణ డోలాయమానంగా తయారైంది. ‘కేసీఆర్ సర్కారు ఏర్పడితే TSPSC ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుంది.. కమిషన్ ను మార్చడం లేదా కొత్త సిస్టమ్ తేవడం వల్ల ఎగ్జామ్స్ కు జాప్యం జరగొచ్చు.. అదే కొత్త ప్రభుత్వం వస్తే కుదురుకునే సరికే 3 నుంచి 6 నెలలు పట్టవచ్చు.. అప్పుడూ కమిషన్ ప్రక్షాళనో లేదా రద్దో చేయాల్సి రావొచ్చు.. ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి’ అన్న మాటలు అభ్యర్థుల నుంచి వినపడుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి కంటున్న ఇక కలలు కలలుగానే మిగిలిపోతాయా అన్న బాధతో కాలం గడుపుతున్నారు.