BJP సీనియర్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు JP నడ్డా ఆర్డర్స్ ఇచ్చారు. నిన్న తెలుగు రాష్ట్రాలకు ప్రెసిడెంట్లను నియమించిన హైకమాండ్… ఇవాళ రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు కట్టబెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో వ్యూహాత్మక రీతిలో BJP అడుగులు వేస్తోందని అర్థమవుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆయన మీట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పదవి కట్టబెట్టడం వెనుక BJP వ్యూహాత్మక వైఖరి స్పష్టమవుతున్నట్లు తెలుస్తోంది.
రఘునందన్ రావు పరిస్థితి…?
పదేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నానని, దుబ్బాక నుంచి సింగిల్ హ్యాండ్ తో గెలిచివచ్చిన తనకు ప్రాధాన్యం దక్కడం లేదని మొన్న దిల్లీలో రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. ఇప్పటికే బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించగా… మరో సీనియర్ అయిన ఈటల రాజేందర్ కు ఎలక్షన్ మేనేజ్ మెంట్ పనులు అప్పజెప్పారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి దక్కడంతో… క్రమంగా సీనియర్లకు తామిస్తున్న గౌరవమేంటో చాటిచెప్పేలా నిర్ణయాలు తీసుకుంది కమలం పార్టీ. ఈ మధ్యకాలంలోనే పార్టీలో చేరిన ఏపీ లీడర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సైతం ముఖ్యమైన పదవే కట్టబెట్టారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన సరైన ప్రయారిటీ ఉంటుందన్న ఇండికేషన్ ఇచ్చే విధంగా వీరి నియామకాలు జరిగాయి. అయితే ప్రెసిడెంట్, లెజిస్లేటివ్ లీడర్, నేషనల్ జనరల్ సెక్రటరీ… ఈ మూడింటిలో ఏది ఇచ్చినా ఓకే అన్న రీతిలో రఘునందన్ రావు మాటలు ఉన్నాయి. పార్టీలోని అత్యంత సీనియర్లలో ఒకరైన రఘునందన్ రావుకు ఇప్పటివరకు ఏ ప్రత్యేక పదవీ కట్టబెట్టకపోవడం… అనుమానాలకు తావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఇబ్బందికరంగా మారాయా అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి.