
Published 03 Dec 2023
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆరు నియోజకవర్గాల్లో పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. అక్కడ ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రి అలోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ లో పరాజయం పాలయ్యారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఆయన ఘోరంగా ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి వెలువడ్డ తొలి ఫలితం(First Result) ఇది. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండలో విజయం సాధించారు. ఆయన BRS అభ్యర్థి, సిట్టింగ్ MLA కంచర్ల భూపాల్ రెడ్డిని ఓడించారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ BRS అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై గెలుపును దక్కించుకున్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ స్థానం నుంచి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. BRS అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై ఆయన విజయాన్ని అందుకున్నారు. గత ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతి ఓడించిన సైదిరెడ్డిని ఈ ఎన్నికల్లో మట్టి కరిపించి ప్రతీకారం తీర్చుకున్నారు. దుబ్బాక నుంచి BRS క్యాండిడేట్ కొత్త ప్రభాకర్ రెడ్డి.. BJP అభ్యర్థి రఘునందన్ రావుపై విజయం సాధించారు. దీంతో కమలం పార్టీ సిట్టింగ్ సీటును కోల్పోయినట్లయింది. జుక్కల్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తోట లక్ష్మీకాంత్ రావు.. BRS నుంచి బరిలోకి దిగిన హన్మంత్ షిండేపై విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంబర్ పేటకు సంబంధించి కారు గుర్తుపై పోటీ చేసిన కాలేరు వెంకటేశ్.. BJP అభ్యర్థి చెనబోయన్న కృష్ణాయాదవ్ ను ఓడించారు.