Published 25 Dec 2023
రోడ్డు ప్రమాదంలో తమవాడు ప్రాణాలు కోల్పోయాడని తెల్లవారుజామునే వాళ్లకు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులంతా ఆటో తీసుకుని ప్రమాద స్థలానికి(Accident Place) బయల్దేరారు. ఆ ఏడుగురు వెళ్తున్న ఆటోను మంచు కమ్ముకున్న పరిస్థితుల్లో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో మరో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. మృతిచెందిన కుటుంబ సభ్యుణ్ని చూడటానికి వెళ్లి మిగతా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా తీవ్ర విషాదం అలుముకుంది.
పెదవూర మండలం నిమ్మానాయక్ తండాకు చెందిన రమావత్ కేశవులు(28) ఆదివారం రాత్రి బైక్ పై మిర్యాలగూడ వెళ్తున్నాడు. నిడమనూరు మండలం వేంపాడు స్టేజి వద్దకు రాగానే అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సైదులు(55) అనే వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ఘటనలో కేశవులుతోపాటు సైదులు కూడా చనిపోయారు.
విషయం తెలుసుకున్న కేశవులు సంబంధీకులు ఏడుగురు ఆటో(టాటా ఏస్)లో బయల్దేరారు.
ఇక కొన్ని క్షణాల్లో అక్కడకు చేరుకుంటామనే లోపే 500 మీటర్ల దూరంలోనే వీరి ఆటోను ట్యాంకర్ తో కూడిన లారీ ఢీకొట్టింది. మంచు కమ్ముకున్న వాతావరణంలో యాక్సిడెంట్ జరగడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. రమావత్ గన్యా(40), రమావత్ పాండ్య(40), రమావత్ బుజ్జి(38), నాగరాజు(28) దుర్మరణం చెందారు. ఘటన జరిగిన సమయంలో అక్కడికక్కడే ముగ్గురు కన్నుమూయగా, మరొకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.