Published 26 Dec 2023
హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటనలో మాజీ MLA కొడుకు మాయ చేశాడు. శనివారం అర్థరాత్రి 2:45 గంటల సమయంలో హై స్పీడ్ తో దూసుకొచ్చిన కారు ప్రజా భవన్ గేట్లను బద్ధలు కొట్టింది. ఈ ఘటనలో బారికేడ్లు ధ్వంసమై కారు దెబ్బతినగా నలుగురు పోలీసులకు చిక్కితే అందులో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. CC ఫుటేజీ ద్వారా విచారణ నిర్వహించిన పోలీసులు.. కారు నడిపింది బోధన్ మాజీ శాసనసభ్యుడు షకీల్ తనయుడు సోహైల్ అని గుర్తించారు. అంతకుముందు ఈ కేసులో హైడ్రామా నడిచింది. పోలీసులే కావాలని మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించారన్న అనుమానాలతో పూర్తిస్థాయి దర్యాప్తునకు దిగారు. దీనిపై విచారణ నిర్వహించిన తర్వాత అసలు నిందితుడు సోహైలే అని గుర్తించినట్లు వెస్ట్ జోన్ DCP విజయ్ కుమార్ తెలిపారు.
ఇది రెండో కేసు.. పాతది మళ్లీ తెరపైకి…
కారును సోహైల్ నడిపినా అతణ్ని తప్పించేందుకు నాటకమాడారని, మరొకరు కారును డ్రైవ్ చేసినట్లు మాయ చేయబోయారని DCP స్పష్టం చేశారు. హైదరాబాద్ CP ఆదేశాల మేరకు పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించిన పోలీసులు.. సోహైల్ నే నిందితుడిగా తేల్చారు. గతంలో జూబ్లీహిల్స్ లోనూ ఇదే తీరులో కారు నడిపి అతడు ఇదే విధంగా వ్యవహరించాడని తెలియజేశారు. ఈయనపై ఉన్న పాత కేసును తిరగదోడి మళ్లీ దర్యాప్తు చేపడతామని DCP తెలియజేశారు. ఇన్సిడెంట్ తర్వాత నాటకీయ పరిణామాలు జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. నిందితుడికి పోలీసులు సహకరించారన్న కోణంలో ఎంక్వయిరీ చేశారు.
పోలీసుల పాత్రపైనా దర్యాప్తు
ప్రమాదం జరిగిన తర్వాత అదే రాత్రి నిందితుణ్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటికే షకీల్ అనుచరులు ఠాణా వద్దకు చేరుకుని సోహైల్ పేరును FIRలో చేర్చొద్దని కోరారు. దీంతో అక్కణ్నుంచి మాజీ MLA తనయుణ్ని తీసుకెళ్లిపోగా.. అసలు నిందితుడి స్థానంలో షకీల్ ఇంట్లో పనిచేసే వ్యక్తి పేరును FIRలో చేర్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని CP నుంచే ఆదేశాలు రావడంతో CC ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. జరిగిన తతంగంలో తమ వాళ్ల పాత్రే ఉందని గమనించిన అధికారులు.. CI, నైట్ డ్యూటీ SIతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.