Published 31 Dec 2023
కొత్త సంవత్సరాన్ని గమ్మత్తుగా ఎంజాయ్ చేయడానికి బదులు మత్తులో తూలుతూ మజా చేసుకునేందుకు కొంతమంది యువతీయువకులు తప్పుడు దారులు వెతుక్కుంటున్నారు. ఈ అర్థరాత్రి పూట జరిగే వేడుకల కోసం ఇప్పటికే మత్తు పదార్ధాల(Drugs)ను కొనేసి పెట్టుకున్నారు. హైదరాబాద్ లో ఈ వ్యవహారం మరీ ముదిరి పాకాన పడటంతో పోలీసులు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తాజాగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన యువతి ఇంట్లోనే మత్తు పదార్థాలు దొరకడం కలకలం రేపుతోంది. పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ దందాను సీరియస్ గా తీసుకోవడంతో ఎక్కడికక్కడ పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్ సప్లయర్స్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ యాంటీ డ్రగ్ బ్యూరో(TSNAB) ముందస్తు చర్యలకు దిగింది. గత 10 రోజుల నుంచి సీరియస్ గా తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇప్పటికే డ్రగ్ పెడ్లర్ల నుంచి పలు చోట్ల మత్తు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంట్లోనూ వాటిని గుర్తించి అరెస్ట్ చేశారు.
మహిళా ఉద్యోగి నిర్వాకం…
రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని అపార్ట్ మెంట్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ మహిళా ఇంజినీర్ నివాసంలో డ్రగ్స్ దొరికాయి. ఆమె ఇంటిపై దాడి చేసిన SOT(స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులు.. 8 గ్రాముల MDMA రకాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి అర్జున్, డేవిడ్ అనే ఆమె స్నేహితులు ఈ డ్రగ్స్ ను తీసుకువచ్చినట్లు పోలీసులు నిర్ధరించుకున్నారు. ఈ యువతి APలోని నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించగా.. శివరాంపల్లిలో ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఈ రాత్రికి న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడేందుకు గాను వీటిని ముందే కొని పెట్టుకున్నారు. బెంగళూరులో వీరికి సప్లయ్ చేసిన వ్యక్తిని గుర్తించి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అయితే వీరి కోసమే డ్రగ్స్ తెచ్చుకున్నారా.. లేక ఇతరులకు ఎవరైనా సప్లయ్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.