Published 05 Jan 2024
వార వారం జరిగే సంత కోసం తండాల నుంచి పట్నానికి వచ్చే పేద ప్రజలు వాళ్లు. మళ్లీ సంత వచ్చేవరకు సరిపడా వస్తువుల్ని కొనుక్కోవడానికి వచ్చి చివరకు సొంతూరు చూడకుండానే కన్నుమూయాల్సి వచ్చిందా అభాగ్యులకి. రహదారుల(Roads)పైనే సంతలు నిర్వహించడం ఎంతటి ప్రమాదకరమో బాలానగర్ ప్రమాదాన్నిచూస్తే తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని బాలానగర్.. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి(Highway)పై ఉంటుంది. రోడ్డుకు రెండు వైపులా రెండు మూడు కిలోమీటర్ల పొడవునా బాలానగర్ ఉంటే.. ప్రధానమైన షాపులు, మార్కెట్ అంతా బస్టాండ్ సమీపంలోనే జరుగుతుంటుంది. ఎక్కడికైనా వెళ్లాలన్నా, రావాలన్నా ఈ బస్టాండ్ ప్రాంతమే కీలకం.
ఆటోను ఢీకొట్టడంతో..
రాష్ట్రంలోనే అత్యధికంగా బాలానగర్ మండలంలో తండాలుంటాయి. ప్రతి శుక్రవారం ఇక్కడ సంత జరుగుతుండగా… ఎప్పటి మాదిరిగానే బాధితులంతా ఆటోల్లో అక్కడకు వచ్చారు. వారు ఎక్కిన ఆటోను స్పీడ్ గా వచ్చిన DCM ఢీకొట్టడంతో.. క్షణాల్లో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాకుండా పోయింది. చూస్తే ఆరుగురి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీంతో ప్రమాదానికి కారణమైన DCMకు స్థానికులు నిప్పుపెట్టారు. ఈ ఘటనతో హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
మహిళలు, చిన్నారులే…
ఆటోను ఢీకొట్టిన DCM.. అక్కడే ఉన్న మోటార్ సైకిల్ పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారంతా మేడిగడ్డ తండా, బీబీనగర్ తండా, నందారం, బాలానగర్ గ్రామాలుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉండగా.. బాధిత ప్రాంతమంతా దయనీయంగా తయారైంది. హైవేలపై జనాలు ఉండటం, ఆటోల్లో ప్రయాణాలు చేయటం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.