
Published 09 Jan 2024
మొన్నటివరకు ప్రగతి భవన్ గా ఉన్న ప్రజా భవన్(Praja Bhavan) గోడల్ని కారుతో బద్ధలు కొట్టిన కేసులో మాజీ MLA షకీల్ తనయుడు సాహిల్ పై ఉచ్చు బిగుసుకోవడంతో.. నిందితుడు హైకోర్టు(High Court)ను ఆశ్రయించాడు. బోధన్ మాజీ MLA షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రహీల్.. ర్యాష్ డ్రైవింగ్ తో ప్రజాభవన్ గేట్లను బద్ధలు కొట్టిన ఘటనలో బారికేడ్లు ధ్వంసమయ్యాయి. కారులో సాహిల్ తోపాటు అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. గత డిసెంబరు 23న అర్థరాత్రి ఘటన జరిగిన సమయంలోనే అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. అదే రాత్రి నిందితుణ్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించిన కొద్దిసేపటికే షకీల్ అనుచరులు అక్కడకు చేరుకుని సాహిల్ పేరును FIRలో చేర్చొద్దంటూ అతణ్ని తీసుకెళ్లిపోయారు. నిందితుడి స్థానంలో షకీల్ ఇంట్లో పనిచేసే వ్యక్తి అసిఫ్ పేరును FIRలో చేర్చారు.
CP సునిశిత ఎంక్వయిరీ…
మామూలు అధికారులు ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో. కానీ హైదరాబాద్ CP శ్రీనివాస్ రెడ్డి సీరియస్ గా తీసుకోవడంతోపాటు పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయించారు. CC ఫుటేజ్ ఆధారంగా విచారణ చేశాక నిందితుణ్ని కావాలనే తప్పించారంటూ CI దుర్గారావును వెంటనే సస్పెండ్ చేశారు. ఈయనతోపాటు మరికొందరు పోలీసులపైనా క్రిమినల్ కేసు ఫైల్ చేసే అవకాశముంది. అటు సాహిల్ అదే రాత్రి దుబాయ్ పారిపోయాడని గుర్తించిన అధికారులు.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. గతంలో జూబ్లీహిల్స్ లోనూ ఇదే తీరులో కారు నడిపి అతడు ఇలాగే వ్యవహరించాడని DCP విజయ్ కుమార్ అప్పుడే తెలియజేశారు. ఈయనపై ఉన్న పాత కేసును తిరగదోడి మళ్లీ దర్యాప్తు చేస్తామన్నారు.
హైకోర్టులో పిటిషన్
తాజా కేసులో పోలీసులు అష్టదిగ్బంధనం చేయడం, పాత కేసును తిరగదోడుతామని చెప్పడంతో షకీల్ తనయుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. దుబాయ్ నుంచి స్వదేశానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో ఇక చేసేది లేక హైకోర్టును ఆశ్రయించాడు. తనపై కేసు కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. FIR(First Information Report)లో పోలీసులు తన పేరును అక్రమంగా చేర్చారని, ఇందులో తనను అన్యాయంగా లాగేందుకు డ్రైవర్ అసిఫ్ పై ఒత్తిడి చేశారని పిటిషన్ లో తెలియజేశారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది.