Published 13 Jan 2024
పదేళ్ల క్రితం ప్రైవేటు వోల్వో బస్సు(Volov Bus)లో మంటలు చెలరేగి 44 మంది సజీవదహనం అయిన ఘటన.. అప్పట్లో సంచలనం కలిగించింది. అప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామం వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి(National Highway)పై ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. తాజాగా అలాంటి తీరులోనే ఈరోజు జరిగిన మరో ఇన్సిడెంట్ సైతం ఆందోళన కలిగించింది. ప్రైవేటు బస్సు బోల్తా పడి మంటలు చెలరేగడంతో అంతా అద్దాలు పగులగొట్టి బయటపడగా, ఒక మహిళ చేయి ఇరుక్కుని అందులోనే ఉండిపోయి సజీవ దహనమైంది. ఎర్రవల్లిలోని పోలీసు బెటాలియన్ కు అత్యంత సమీపంలో బస్సు పూర్తిగా కాలిపోగా… సజీవ దహనమైన మహిళకు సంబంధించిన డీటెయిల్స్ కోసం పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు.
హైవేపైనే డేంజర్…
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎర్రవెల్లి చౌరస్తాలో సరిగ్గా అదే హైవేపైనే ఈ ఘటన జరిగింది. చిమ్మచీకట్లో ప్రమాదం జరగడంతో నిద్రలో ఉన్నవారంతా హాహాకారాలు చేశారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న సమయంలో ఇన్సిడెంట్ జరగ్గా.. భారీగా మంటలు వచ్చాయి. ఫైరింజన్లతో మంటలు ఆర్పేయడంతో.. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిద్రమత్తులో డ్రైవర్ బస్సును నడిపారా లేక మరో వెహికిల్ ను ఓవర్ టేక్ చేస్తుంటే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.
పదేళ్ల క్రితం ఇదే తరహాలో…
2013 అక్టోబరు 30న పాలెం వద్ద బస్సు దగ్ధమైన ఘటనలో 44 మంది సజీవ దహనమయ్యారు. జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దారుణం జరిగింది. పాలెం వద్ద బస్సు ఇంజిన్ కల్వర్టును తాకడంతో స్పార్క్ వచ్చి వాహనం బూడిదయింది. ఏసీ ఫోమ్ కు లోపల పొగ కమ్ముకుని ఊపిరాడక అందులోనే స్పృహ తప్పి పడిపోయారు. బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో జర్నీ చేస్తున్నవాళ్లంతా సజీవ దహనమయ్యారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించగా.. వోల్వో బస్సుల తీరుపై అనుమానాలు కలిగించాయి. ఇప్పుడు సరిగ్గా ఇదే తీరులో మరో బస్సు సైతం మంటలకు ఆహుతవడం, ఒకరు సజీవ దహనం కావడం ఆనాటి ఘటనను గుర్తు చేసింది.