
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే ‘సార్’ మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించాడు. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంల్ నటిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ఫస్ట్ లుక్కు హ్యూజ్ రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉంటే.. ధనుష్‌పై నిషేధం విధించడానికి తమిళ సినీ నిర్మాతల మండలి (TFPC) యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తమ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే కారణంతో తమిళ నటులు శింబు, విశాల్, ఎస్జే సూర్యలపై టీఎఫ్‌పీసీ నిషేధం విధించడం అభిమానులకు షాక్ ఇచ్చింది. దీనిపై సదరు స్టార్స్ ఇంకా స్పందించలేదు. అయితే, ఇప్పుడు ధనుష్పైనా ఇలాంటి చర్యలకే సిద్ధమవుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.

విషయానికొస్తే.. ప్రముఖ కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ‘శ్రీ తేనాండాల్ ఫిల్మ్స్’ బ్యానర్లో ధనుష్ తన సెకండ్ డైరెక్టరియల్ ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడు. ఇందుకు సంబంధించి 2017లోనే అధికారిక ప్రకటన వెలువడింది. కానీ ఇప్పటికీ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇలా చాలా కాలంగా తన కమిట్మెంట్ పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో ధనుష్ తీరుపై సదరు నిర్మాతలు టీఎఫ్పీసీని సంప్రదించినట్లు సమాచారం. అయితే సమస్య గురించి విచారించిన కౌన్సిల్.. ధనుష్‌పై నిషేధం విధించే దిశగా నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు టాక్.