ఇప్పటికే నీటిపారుదల, పశుసంవర్ధక శాఖలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… తాజాగా మరో అంశంపైనా చర్యలు తీసుకోవాలని చూస్తున్నది. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) టోల్ టెండర్లలో జరిగిన అవకతవకల(Frauds)పై విచారణ జరిపించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. HMDA వ్యవహారాలపై సమీక్ష నిర్వహిస్తూ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ORR టోల్ టెండర్ల పూర్తి వివరాలు సమర్పించాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించిన ముఖ్యమంత్రి… విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) లేదా మరో సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వివరాలు అందజేయాలని HMDA జాయింట్ కమిషనర్ కు స్పష్టం చేశారు.
దీర్ఘకాలిక లీజు కోసం…
హైదరాబాద్ మహానగర మణిహారమైన ORRను గత ప్రభుత్వం దీర్ఘకాలిక లీజు కోసం అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్(TOT) విధానంలో 30 ఏళ్లపాటు లీజుకు గాను తొలుత నాలుగు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన తర్వాత ఎల్-1గా IRB ఇన్ ఫ్రా లిమిటెడ్ నిలిచింది. మొత్తం రూ.7,380 కోట్లకు బిడ్ ఫైనల్ కాగా.. మేనేజ్మెంట్ నుంచి టోల్ వరకు మొత్తం కార్యకలాపాలు ప్రైవేటు సంస్థ చూసుకుంటుంది. 158 కిలోమీటర్ల మేర ORR ఉండగా, నిత్యం 1.30 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఔటర్ పై ఎక్కి, దిగడానికి 44 పాయింట్లతోపాటు 22 ఇంటర్ ఛేంజ్ జంక్షన్స్ ఉన్నాయి.
భారీగా ఆదాయం…
టోల్ కలెక్షన్ల కింద ORR ద్వారా ఏటా రూ.500 కోట్ల దాకా రాబడి ఉండగా, ప్రతి సంవత్సరం 5 శాతం వరకు పెంచుకునే అవకాశముంది. ఇప్పటిదాకా ORRను హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(HGCL) చూస్తున్నది. ఫండ్స్, మానవ వనరుల కొరత వల్ల నిర్వహణ భారంగా మారినందునే దీన్ని లీజుకు అప్పగిస్తున్నట్లు ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ఆనాడు ఇచ్చిన హామీ మేరకు… ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించారు.