బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(Investigation Teams)లు నిందితుడి కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఆరు రోజులుగా విస్తృతంగా గాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ టీమ్ లు… నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి భారీ నజరానా ఇస్తామని ప్రకటించాయి. దుండగుడిపై ఇప్పటికే పూర్తి నిర్ధారణకు వచ్చిన ఎన్ఐఏ(National Investigation Agency).. అతడి వివరాలు చెప్పినవారికి రూ.10 లక్షల నజరానా ఇస్తామని తెలిపింది.
అప్పట్నుంచి వేట…
మార్చి 1న మధ్యాహ్నం బాంబు పేలుడు జరగ్గా అప్పట్నుంచి ఈ కేసును కేంద్ర హోం వ్యవహారాల శాఖ పర్యవేక్షిస్తున్నది. ఇప్పటికే NIA, IB(Intelligence Bereau) అధికారులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. 25-30 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డట్లు CC కెమెరాల ద్వారా గుర్తించి AI(Artificial Intelligence) ఆధారంగా ముఖ కవళికల్ని గుర్తించారు. ఈ దాడిలో 10 మందికి గాయాలైన సంగతి తెలిసిందే.
మరిన్ని దాడులంటూ…
కర్ణాటకలో మరిన్ని దాడులు చేస్తామంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రికి వచ్చిన రెండు మెయిళ్లను అధికారులు పరిశీలించారు. కర్ణాటకలో VVIPలు ఉండే ప్రాంతాల్లో దాడులు చేస్తామంటూ ఒక మెయిల్ రాగా.. ఆ దాడుల్ని ఆపాలంటే 2.5 మిలియన్ డాలర్ల(రూ.21 కోట్ల)ను పంపాలంటూ దుండగులు డిమాండ్ చేశారు. బాంబు దాడి జరిగిన తెల్లారి అంటే ఈ నెల 2న శనివారం మొదటి మెయిల్ రాగా.. రెండో మెయిల్ ఈ నెల 4న సోమవారం నాడు వచ్చింది. ఈనెల 4న వచ్చిన ఈ-మెయిల్ షాహిద్ ఖాన్(Shahidkhan10786@protonmail.com) పేరిట రాగా.. ఆ వివరాల్ని ఐటీ వ్యవహారాల శాఖకు పంపించారు. కూపీ లాగితే ప్రోటాన్(Proton) అనేది స్విట్జర్లాండ్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీగా తేలింది. మరి ఈ పేరు వాడుకుని ఈ-మెయిల్ పంపించి ఉంటారా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది.