టెన్త్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లకు రూ.30 వేలు.. డిగ్రీ అయితే రూ.40 వేలు.. ఇక ఇంజినీరింగ్ అయితే రూ.50 నుంచి రూ.60,000. గల్ఫ్(Gulf) వెళ్లేందుకు ఓ వ్యక్తికి టెన్త్ సర్టిఫికెట్ కావాల్సి వచ్చింది. కానీ అతడు చదివింది తొమ్మిదో తరగతి. టెన్త్ లేనిదే విదేశం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఒక మహిళ అడ్రస్ ఇచ్చాడు తన ఊరికే చెందిన ఫ్రెండ్. ఇంకేముంది ఆ మహిళను కాంటాక్ట్ చేయడం, డబ్బులు పంపడం, సర్టిఫికెట్ రావడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసోళ్లకు తెలిసి కూపీ లాగితే డొంకంతా కదిలింది.
విస్తుపోయే విషయాలివి…
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన కొడిదల మహేశ్ కు.. గల్ఫ్ వెళ్లేందుకు పాస్ పోర్ట్ అవసరమైంది. టెన్త్ లేకున్నా సర్టిఫికెట్ ఉంటే చాలన్న ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన కొక్కరకని చంద్రయ్య@చందు ఓ సలహా ఇచ్చాడు. తన దగ్గరి బంధువు రజితతో మాట్లాడితే నకిలీ సర్టిఫికెట్లు(Fake Certificates) ఇప్పిస్తుందని చెప్పాడు. దీంతో మహేశ్ కాస్తా రజితతో మాట్లాడటం, అందుకోసం రూ.30 వేలు అడిగితే రూ.28వేలు ఫోనే పే ద్వారా పంపడం చేశాక.. 27 రోజుల తర్వాత నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ పేరుతో రూల్ నంబరు సహా SSC సర్టిఫికెట్ వచ్చింది. ఇంకేముంది పాస్ పోర్టుకు మహేశ్ అప్లై చేసుకున్నాడు. దాని ఎంక్వయిరీకి వచ్చిన పోలీసులకు అది నకిలీ సర్టిఫికెట్ అని తెలిసిపోయింది.
అదుపులో నిందితులు…
జిల్లా SP స్వయంగా దీనిపై దృష్టి సారించి విచారణ చేయించారు. రజిత దంపతులు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కాలం గడుపుతుండగా ఆ జీతం సరిపోక ఈ దందాకు అలవాటు పడ్డట్లు పోలీసులు గుర్తించారు. Just Dial అనే చోట పనిచేస్తున్న టైమ్ లో రబీ రాయ్ అనే బెంగాలీ.. రజితకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా సర్టిఫికెట్ల దందాకు దారితీసింది. రబీరాయ్ తల్లి లక్ష్మీరాయ్ పేరిట డబ్బులను రజిత పంపడం, అక్కణ్నుంచి సర్టిఫికెట్లు రావడం జరుగుతూనే ఉన్నాయి. వచ్చిన డబ్బులో సగం ఈమెకు ఇంకో సగం రబీరాయ్ కు చేరింది. ఈ మూడేళ్లలో 100 సర్టిఫికెట్లు ఇప్పించినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు రూ.15.41 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించగా.. 420, 465, 468, 471, 109 r/w, 34 IPC కింద కేసులు ఫైల్ చేశారు. వీరి నుంచి 395 నకిలీ సర్టిఫికెట్లు, 5 సెల్ ఫోన్లు, బైక్, ల్యాప్ టాప్, CPU, రూ.25,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.