ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచిన ED.. అందులో జరిగిన వ్యవహారాలను బయటపెట్టింది. ఎవరెవరికి ఎంత ఇచ్చారు.. ఏయే లీడర్ల ప్రమేయం(Involvement) ఉంది.. అన్న విషయాల్ని తెలియజేసింది. BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల అతిపెద్ద మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని.. ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో కలిసి ఆమె కుట్ర పన్నారంటూ ఛార్జిషీట్ లో పొందుపరిచింది. KCR కుమార్తె అరెస్టు, విచారణ తర్వాత ED పలు వివరాల్ని పంచుకుంది.
ఆటంకం కలిగించారంటూ…
కవిత ఇంట్లో సోదాలకు వెళ్లిన సమయంలో అడుగడుగునా ఆమె కుటుంబ సభ్యులు ఆటంకాలు కలిగించారని ED ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు చేశామని.. దేశ రాజధానితోపాటు హైదరాబాద్, ముంబయి, చెన్నైల్లో భారీ ఎత్తున దాడులు చేపట్టినట్లు తెలిపింది. మనీశ్ సిసోదియా, కవిత, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తోపాటు ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేయగా, రూ.128.79 కోట్ల మేర సీజ్ చేసినట్లు వివరించింది.
ఆప్ నేతలతో…
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సీనియర్ నేతలతో కలిసి కల్వకుంట్ల కవిత అక్రమాలకు పాల్పడినట్లు ఇన్వెస్టిగేషన్ లో గుర్తించామని ED తెలియజేసింది. 2021-22 సంవత్సరంలో లిక్కర్ స్కామ్ కు గాను ‘ఆమ్ ఆద్మీ’ పార్టీకి రూ.100 కోట్లను ఆమె అందజేసినట్లు గుర్తించామని క్లారిటీ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధం(Rules Violation)గా పాలసీని తయారు చేసి, హోల్ సేల్ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారని ఆరోపించింది. ఈ విషయాలన్నింటినీ పొందుపరుస్తూ ఒక ఛార్జిషీట్, మరో 5 అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేశామని ED తెలిపింది.