యోగా గురువుగా పేరుపొందిన రాందేవ్ బాబాకు దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court)లో చుక్కెదురైంది. తన పతంజలి ఆయుర్వేద కంపెనీ విషయంలో కోర్టుకు రావాల్సిందేనంటూ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో రాందేవ్ తోపాటు పతంజలి కంపెనీ MD ఆచార్య బాలకృష్ణ ఏప్రిల్ 2న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా పత్రికల్లో ప్రకటనలు(Advertisements) ఇస్తున్నారంటూ వీరిద్దరిపై ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మోసపూరిత ప్రకటనలపై పతంజలి మీద గతంలోనే ఫిర్యాదులు(Complaints) వచ్చాయి.
కోర్టు ధిక్కరణకు పాల్పడి…
ఇక నుంచి అలాంటి ప్రకటనలు ఇవ్వబోమంటూ గతంలో జరిగిన విచారణ(Hearing) సందర్భంగా పతంజలి సంస్థ హామీ ఇచ్చింది. అయితే ఇచ్చిన మాటను ధిక్కరించి మీడియాలో ప్రకటనలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది. 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అభ్యంతకర ప్రకటన చట్టంలోని సెక్షన్ 3, 4 ను రాందేవ్, బాలకృష్ణ ఉల్లంఘించారని న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ద్విసభ్య బెంచ్(Devision Bench) అభిప్రాయపడింది. దీనిపై ఫిబ్రవరి 27న ఈ ఇద్దరిపై ధిక్కరణ నోటీసు జారీ అయింది.
వ్యాధులకు మందులంటూ…
అస్తమా, గుండె జబ్బుల వంటి వ్యాధుల్ని నయం చేస్తామంటూ ఆధారాలు లేని వాదనలు చేస్తున్నారని పతంజలిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాధులకు సంబంధించిన మందుల(Medicine) గురించి ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. సదరు వ్యాపార ప్రకటనల్ని తొలగించడానికి తీసుకున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
పతంజలి ఆయుర్వేద యాడ్స్ పై 2023 నవంబరులోనూ సుప్రీంకోర్టు మండిపడింది. ఆధునిక వైద్యానికి వ్యతిరేకంగా తప్పుదోవ పట్టించే వాదనలు ప్రచారం చేస్తున్నారని గుర్తు చేస్తూ.. ఇవి కొనసాగితే కోటి రూపాయల జరిమానా(Fine) వేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. నోటీసులు పంపినా ఈ ఇద్దరు స్పందించకపోవడంతో తమ ఎదుట కచ్చితంగా హాజరు కావాల్సిందేనంటూ సుప్రీం బెంచ్ ఆదేశించింది.