పేదలు అనారోగ్యం బారిన పడితే ప్రభుత్వం నుంచి అందించాల్సిన నిధుల కోసం ఉద్దేశించిన ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF) చెక్కులు దుర్వినియోగమైన కేసులో అరెస్టులు మొదలయ్యాయి. CMRF చెక్కుల గోల్ మాల్ పై నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్ పోలీసు స్టేషన్ లో దీనిపై కేసు ఫైల్ కాగా.. దర్యాప్తు నడుస్తున్నది. ఈ నెల 21న మెదక్ జిల్లా పీర్లతండాకు చెందిన రవినాయక్ అనే వ్యక్తి కంప్లయింట్ తో కేసు నమోదు చేశారు.
సీఎం ఆఫీసులో…
ముఖ్యమంత్రి కార్యాలయం(CM Office)లో చెక్కుల్ని విడుదల చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగే మరో ముగ్గురితో కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు. జోగుల నరేశ్ కుమార్ అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిపి అసలు చెక్కుల్ని ఇతరులకు ఇచ్చి పక్కదారి పట్టించినట్లు తేలింది. బాధితుడు రవినాయక్ సతీమణి పాముకాటు బారిన పడటంతో చికిత్స కోసం సంగారెడ్డికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్ తరలించి ట్రీట్మెంట్ ఇస్తుండగా ఆమె మృతిచెందారు. దీంతో ఆమెకు సంబంధించిన బిల్లుల్ని క్లెయిమ్ చేసుకునేందుకు CMRF కింద అప్లయ్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా రెండు చెక్కులు రూ.50,000, రూ.37,000 చొప్పున ఇవ్వాల్సి ఉన్నా అవి రాలేదంటూ నరేశ్ దాటవేస్తుండటంతో అనుమానం వచ్చింది రవినాయక్ కు.
పక్కదారి ఇలా…
తనకు రావాల్సిన చెక్కులు వేరే వాళ్ల పేరుతో విత్ డ్రా అయినట్లు రవినాయక్ గుర్తించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-5లో గల బ్యాంకు నుంచి తీసుకున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోదావరిఖనికి చెందిన ఓంకార్ అనే వ్యక్తి సాయంతో ఈ డబ్బుని విత్ డ్రా చేసినట్లు గుర్తించిన పోలీసులు… ప్రధాన నిందితుడు నరేశ్ తోపాటు వంశీ, వెంకటేశ్ గౌడ్, ఓంకార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇలాంటి బాధితులు ఉంటే తమకు కంప్లయింట్ ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు.