కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో దోషికి కోర్టు శిక్ష విధించింది. ఇది అత్యంత అరుదైన కేసు కాదని భావించిన న్యాయస్థానం.. దోషిగా సంజయ్ రాయ్ ను నిర్ధారిస్తూ జీవితఖైదు(Life Imprisonment)తోపాటు రూ.50 వేల జరిమానా విధించింది. దోషి మరణించే వరకు జైలులోనే ఉంచాలని సీల్దా(Sealdah) కోర్టు న్యాయమూర్తి అనిర్బన్ దాస్ తీర్పునిచ్చారు. 2024 ఆగస్టు 9న 31 ఏళ్ల డాక్టర్ పై హత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సంజయ్ కు ఉరిశిక్ష విధించాలంటూ CBI న్యాయవాది వాదనలు వినిపించగా, తాను ఏ తప్పూ చేయలేదని నిందితుడు వాదించాడు. అటు బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించగా, కోర్టులోనే ఉన్న బాధిత ఫ్యామిలీ అందుకు నిరాకరిస్తున్నట్లు జడ్జికి తెలిపింది.
పరిహారం తీసుకోవడమనేది కుటుంబ సభ్యుల నిర్ణయంపైనే ఆధారపడి ఉందని, కానీ ప్రభుత్వం మాత్రం రూ.17 లక్షలు ఇచ్చేందుకు రెడీగా ఉండాలని ఆదేశించింది. అతడికి ఉరిశిక్ష విధిస్తేనే నిజమైన న్యాయం దక్కినట్లుగా భావిస్తామని, ఈ తీర్పుపైనా పైకోర్టులో పోరాటం చేస్తామని బాధితురాలి తల్లిదండ్రులు స్పష్టం చేశారు. హాస్పిటల్లో వలంటీర్ గా పనిచేస్తున్న సంజయే అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆధారాలు సమర్పించిన CBI.. సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం ఉరిశిక్ష విధించాలని వాదనలు వినిపించింది. CBI ఇన్వెస్టిగేషన్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె తల్లిదండ్రులు.. ఈ కేసులో మిగతా వ్యక్తులు తప్పించుకునేలా దర్యాప్తు సాగిందని ఆరోపించారు.