‘లవ్ జిహాద్’ కేసులో అసలు నిజం విని ఉత్తరప్రదేశ్ పోలీసులు బిత్తరపోయారు. 6 రాష్ట్రాల్లో 10 మంది అరెస్టయితే, అందులో మహ్మద్ అలీ అనే వ్యక్తి ఒకడు. 18, 33 ఏళ్ల వయసున్న అక్కచెల్లెలు అదృశ్యమైన తర్వాత ఆగ్రా(Agra) పోలీసుల దర్యాప్తు మొదలైంది. బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఈ మహ్మద్ అలీ కూడా మతం మారిన బాధితుడే. రాజస్థాన్ కు చెందిన ఇతడి అసలు పేరు పియూష్ పన్వర్. 2021లో షానా అనే మహిళతో పరిచయమేర్పడింది. ప్రేమలో పడి పెళ్లికి రెడీ అయ్యారు. అప్పుడు ఆమె ఒక షరతు పెట్టింది. ఇస్లాంలోకి వస్తేనే వివాహం అనడంతో పన్వర్ కాస్తా అలీ అయ్యాడు. కానీ కొద్దికాలానికే అతణ్ని ఆమె వదిలిపెట్టింది. ఇక ముస్లింగానే ఉంటూ బరేలీ అమ్మాయిని పెళ్లాడాడు.
ఇస్లాంలోకి వచ్చేటపుడే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) సభ్యుడు మహ్మద్ గౌస్ తో పరిచయమైంది. ‘లవ్ జిహాద్’తోనే అరెస్టైన కలీం సిద్దిఖీతో పన్వర్ ను కలిపాడు గౌస్. మత విద్య కోసం బెంగాల్లోని మదర్సాల్లో ఉన్నాడు పన్వర్. ఏడాది క్రితం గోవాకు చెందిన అయేషాతో పరిచయమైంది. అమెరికా, కెనడా నిధులతో మహిళల్ని ట్రాప్ చేసే పనిలో ఉంది ఈ జంట. పోలీసులు అరెస్టు చేసిన 10 మందిలో అయేషా ఒకరు. ప్రధాన సూత్రధారి చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ అరెస్టయ్యాక ఈ అసలు యవ్వారమంతా బయటకు వచ్చింది.