
బాసర సరస్వతీదేవి ఆలయం భవిష్యత్తులో సరికొత్తగా కనిపించనుంది. రూ.225 కోట్లతో చేపట్టే పనులకు సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. 20 వేల చదరపు అడుగుల గుడి రానున్న రోజుల్లో 62 వేల చదరపు అడుగులుగా మారుతుంది. 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని శృంగేరి పీఠం సూచనలతో 5 వేల చదరపు అడుగులకు విస్తరిస్తారు. పూర్తిగా శిలలతో ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగతా 3 వైపుల ఏడు అంతస్తుల రాజగోపురాలు నిర్మాణమవుతాయి.
గర్భాలయం, అర్ధ మండపం, రాజగోపురం, మాడవీధులు, ఉత్తర ద్వార నిర్మాణాలతోపాటు 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు నిర్మిస్తారు. కుటుంబ సమేతంగా రేవంత్ పూజలు చేసి మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు.
