ములుగు జిల్లా జంపన్న వాగులో గల్లంతయిన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం 8 మంది గల్లంతు కాగా అందరూ ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన బృందాలు.. శుక్రవారం పొద్దున ఐదు మృతదేహాల్ని వెలికితీశాయి. వాగులో గల్లంతయిన మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలింపు జరిపారు. చివరకు అర్థరాత్రి సమయానికి ఆ మిగతా మూడు మృతదేహాల్ని గుర్తించి బయటకు తీసుకువచ్చారు. ఈ ముగ్గురి ఆచూకీ కోసం అధికారులు డ్రోన్ లను ఉపయోగించారు.
ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేసింది. మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జంపన్న వాగు వరదనీరు వన దేవతల గద్దెల వరకు చేరింది. ఏజెన్సీ ప్రాంతంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది.