సరదాగా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లారు.. కలిసి భోజనం చేద్దామని చెట్టుకింద కూర్చొన్నారు.. తిన్న తర్వాత చేతులు కడుక్కుందామని పక్కనే ఉన్న కాల్వలోకి దిగారు. కాలు జారి అందులో పడిపోయిన నేస్తాన్ని కాపాడేందుకు ప్రయత్నించి మరొకరు అందులో పడిపోయారు. ఇలా ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ గల్లంతైన ఘటన నిజామాబాద్ జిల్లా మెండోరలో జరిగింది. మెండోరకు చెందిన భవిత్ రెడ్డి, నిజామాబాద్ కు చెందిన వేణు, ప్రణవ్, రణదీప్ స్నేహితులు. హైదరాబాద్ బాచుపల్లిలోని ఇంజినీరింగ్ కాలేజీలో వీరంతా స్టూడెంట్స్. ఇందులో వేణు డిగ్రీ పూర్తయింది. భవిత్ రెడ్డిని కలుసుకునేందుకు ఈ ముగ్గురు మెండోరకు వెళ్లారు. మధ్యాహ్నం అక్కడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లంచ్ ప్యాక్ చేయించుకుని.. SRSP కాకతీయ కాల్వ పక్కన భోజనం చేశారు.
చేతులు కడుక్కునేందుకు తొలుత ప్రణవ్, వేణు కాల్వలోకి దిగారు. ఈత రాని ప్రణవ్ ను వేణు చేయి పట్టుకోగా, కొద్దిగా కిందికి వెళ్లిన ప్రణవ్ కాలు స్లిప్ అయి అందులో పడిపోయాడు. ఫ్రెండ్ ని పట్టుకుందామని ట్రై చేసిన వేణు కూడా అందులోకి జారిపడ్డాడు. అలా వారు కొట్టుకుపోవడాన్ని చూసి మిగతా ఇద్దరు నీళ్లల్లోకి దూకేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో కాల్వలోని మోటార్ పైపులను పట్టుకుని భవిత్ రెడ్డి, రణదీప్ బయటకు వచ్చారు. నీటిలో పడిపోయిన ఇద్దరు గల్లంతు కాగా… వారి కోసం గాలిస్తున్నట్లు మెండోర ఎస్ఐ గుండవేని శ్రీనివాస్ తెలిపారు. కాకతీయ కాల్వలో ఫ్లో(Flow) ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. అయితే SRSP SEతో మాట్లాడిన SI… పై నుంచి నీటి విడుదలను ఆపివేయించారు. కాల్వలో పూర్తిగా నీరు తగ్గిపోయేందుకు 10 గంటల సమయం పడుతుందని SI శ్రీనివాస్ తెలియజేశారు.