
జాతి ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారిన మణిపూర్ లో భారీ దోపిడీ చోటుచేసుకుంది. అలర్లను అణచివేసేందుకు ఏర్పాటు చేసిన రిజర్వ్ పోలీసు బెటాలియన్ పై ఓ గుంపు(Mob) దాడికి పాల్పడింది. ఈ దాడిలో భారీయెత్తున ఆయుధాల్ని ఎత్తకెళ్లగా.. 24 గంటల్లో పోలీసులు వాటిని రికవరీ(Recovery) చేసుకున్నారు. ఆగస్టు 3న రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. సంచలనంగా మారింది. మూక దాడికి దిగగానే అక్కడే ఉన్న సెంట్రీలు 327 రౌండ్లపాటు కాల్పులు జరిపి 20 టియర్ గ్యాస్ షెల్స్ ను పేల్చారు. 500 మందితో కూడిన గుంపు ఒక్కసారిగా ఇండియా రిజర్వ్ బెటాలియన్(IRB)లోకి చొచ్చుకు వచ్చింది. 298 రైఫిల్స్, SLRలు, లైట్ మెషిన్ గన్స్(LMG)లు, మోర్టార్లు, గ్రనేడ్లతోపాటు 16,000 రౌండ్ల మందుగుండును ఎత్తుకెళ్లారు. అల్లర్లు మొదలయ్యాక ఇంత పెద్ద దాడి జరగటం ఇదే తొలిసారి కాగా.. దీనిపై IRB అధికారి మొయిరంగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు. ఈ ఘటనపై మణిపూర్ DGP రాజీవ్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హై సెక్యూరిటీ జోన్ గల సెకండ్ IRBలోకి చొచ్చుకు రావడాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు.. 24 గంటల్లో వాటిని రికవరీ చేసుకున్నారు.
లూటీకి గురైన వాటిలో ఒక కలష్నికోవ్, 3 చేతక్ లు, పెద్దసంఖ్యలో ఎక్స్ క్యాలిబర్ గన్స్, 5.56mm ఇన్సాస్ LMGలు, MP5లు, 16 తుపాకులు ఉన్నాయి. 40 నుంచి 45 వెహికిల్స్ లో వచ్చిన గుంపు.. ఆగస్టు 3న రాత్రి 9:45కి దాడికి పాల్పడింది. మణిపూర్ లో గత మే నెలలో అల్లర్లు స్టార్ట్ అయిన తర్వాత చాలా ప్రాంతాల్లో వెపన్స్ లూటీ జరిగింది. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ లోని కాక్ చింగ్, తౌబాయ్, బిష్ణుపూర్, చురాచంద్ పూర్, కాంగ్ పోక్పి, తెంగ్ నౌపాల్, కమ్ జోంగ్ ప్రాంతాల నుంచి ఆయుధాల్ని అపహరించారు. కానీ వాటి కోసం ఇప్పటివరకు పోలీసులు వెతుకుతూనే ఉన్నారు.