మణిపూర్ లో మరో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్నవారిపై కాల్పులు జరపడంతో తండ్రి, కొడుకు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బిష్ణుపూర్ జిల్లా ఉఖా తంపక్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. చురాచంద్ పూర్ నుంచి వచ్చినవారే ఈ ఘాతుకానికి(Incident) పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. క్వక్తా ఏరియాకు చెందిన ఈ ముగ్గురు జాతి ఘర్షణల వల్ల గత కొంతకాలం పాటు రిహాబిలిటేషన్ సెంటర్లో తలదాచుకున్నారు. ఈ మధ్యనే తిరిగి ఇంటికి చేరుకోగా.. ఈ రోజు కాల్పుల్లో మృత్యువాత పడ్డారు.
క్వక్తాలో మిలిటెంట్లు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు సహా ముగ్గురు గాయపడ్డారు. ఈ పరిణామాలతో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని మరింత తగ్గించారు. ఇప్పటివరకు పొద్దున 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ రిలాక్సేషన్(Relaxation) ఉండగా.. ఇప్పుడు దాన్ని కేవలం పొద్దున 5 నుంచి 10:30 వరకు మాత్రమే అమలు చేయాలని అధికార యంత్రాంగం డిసైడ్ అయింది.