
జాతుల ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్ లో మారణహోమం ఆగట్లేదు. శనివారం దుండగులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రెండు గ్రూపుల మధ్య చోటుచేసుకున్న కాల్పుల్లో మరో 16 మంది గాయాల పాలయ్యారు. మోటార్ షెల్స్, గ్రనేడ్స్, తుపాకులతో దాడులకు దిగడంపై పోలీసులు దృష్టిసారించారు. అయితే రెండ్రోజుల క్రితం బిష్ణుపూర్ జిల్లాలోని సెకండ్ ఇండియా రిజర్వ్ బెటాలియన్(IRB) నుంచి ఎత్తుకెళ్లిన ఆయుధాలనే ఈ దాడులకు వాడినట్లు అనుమానిస్తున్నారు. నిన్న ఒకే కుటుబంలోని తండ్రి, కొడుకు సహా ముగ్గురు మరణించగా.. వివిధ ప్రాంతాల్లో మరో ముగ్గురు సైతం మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు.
వీరి మృతితో క్వక్తా ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడి మహిళలు రోడ్లపైకి వచ్చి పెద్దయెత్తున నిరసనలు చేపట్టారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని రాష్ట్రంలో హింసను ఆపాలంటూ యూరిపోక్ లో నినాదాలు చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే మరో ముగ్గురు హత్యకు గురయ్యారన్న వార్త గుప్పుమంది. అదే క్వక్తా ప్రాంతంలో గ్రనేడ్లు, మోటార్ షెల్స్ వంటి లేటెస్ట్ వెపన్స్(Weapons)తో దుండగులు దాడికి పాల్పడి ముగ్గుర్ని పొట్టనబెట్టుకున్నారు. చురాచంద్ పూర్ జిల్లాలో ఫౌజాంగ్, సాంగ్డో గ్రామాల్లో దాడులకు తెగబడ్డారు.